వాట్సాప్‌తో మీ సేవలు..
తెగిన విద్యుత్ తీగలు..
తృటిలో తప్పిన ప్రమాదం
ఆలేరు: విద్యుత్ తీగలు (ఎల్‌టీ లైన్) తెగి తృటిలో ప్రమాదం తప్పిన సంఘటన ఆలేరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరులోని వివేకానంద విగ్రహం వద్దకు వెళ్లే దారిలో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో లారీ ఓవర్‌లోడ్‌తో బహుదూర్‌పేట బైపాస్ మీదుగా వెళుతోంది. మంతపురి మార్గంలోని మైత్రి–సిల్క్‌నగర్ కాలనీల వద్దకు రాగానే లారీపైన ఉన్న సామగ్రికి రెండు కాలనీల మీదుగా వెళుతున్న విద్యుత్ తీగలు తాకడంతో తీగలు తెగిపోయి కింద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న కిరాణ దుకాణదారులు, యువకులు, చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో భయంతో వారు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విద్యుత్ లైన్‌మెన్ రమేష్ సబ్‌స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకుని సంఘటన ప్రాంతంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేయించాడు. విద్యుత్ తీగల రాపిడితో లారీ లోడ్‌పైన ఉన్న ప్లాస్టిక్ కవర్‌కు అంటుకున్న మంటలను స్థానికులు, లారీ డ్రైవర్ ఆర్పివేయడంతో అందరూ ఉపీరి పీల్చుకున్నారు. గంటన్నరపాటు సిల్క్‌నగర్, మైత్రి కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తర్వాత తీగలను సరిచేసి ఆయా కాలనీలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
సంస్థాన్ నారాయణపురం: రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్స్ పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మీ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొత్త డిజిటల్ సేవలను ఇటీవల ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండానే చేతిలోని మొబైల్ ద్వారా మీ సేవలను పొందవచ్చు.
580 సేవలు
మీ సేవ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న 580 సేవలు, ఇక వాట్సాప్ చానల్ కిందకు తీసుకొస్తారు. ప్రస్తుతానికి సర్టిఫికెట్స్ పొందడానికి అవకాశం ఉంది. వీటిని దశలవారీగా పెంచుకుంటూ పూర్తి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. ఆదాయం, కులం, నివాస, జనన, మరణ, మార్కెట్ విలువ, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్‌ల కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, రెవెన్యూ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్, విద్యుత్, నీటి, ఆస్తి పన్ను, ఆర్టీఏ, ఆలయాలు, పౌర సరఫరాల సేవలు పొందవచ్చు. మీ సేవ కేంద్రాలు లేనిచోట, గ్రామీణ ప్రాంత ప్రజలకు వాట్సాప్ సేవలు ఎంతో ఉపయోగపడతాయి.
సేవలు ఎలా పొందవచ్చంటే..
● స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా సేవలు పొందడం ఎంతో సులభం. ● ముందుగా మొబైల్‌లో మీ సేవ నంబర్ 8096958096 ను సేవ్ చేసుకోవాలి.
● వాట్సాప్ ఒపెన్ చేసి మీ సేవ వాట్సాప్ నంబర్‌కు హెచ్‌ఐ లేదా ఎంఈఎన్‌యూ(మెనూ) అని టైప్ చేసి సెండ్ చేయాలి. ● మీసేవలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది. ● జాబితా వచ్చిన తర్వాత ఆధార్ ధృవీకరణ ఆప్షన్ వస్తుంది. ● ఆధార్ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంపిక చేసుకోవాలి. ● దరఖాస్తు ఫారమ్‌ను ఇంటర్‌ఫేస్ ద్వారా నింపవచ్చు. ● దరఖాస్తు చేసే సేవకు అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి వాట్సాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ● సేవ ఆధారంగా నిర్ణయించిన ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు. ● దరఖాస్తు స్టేటస్, అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు. ● సర్టిఫికెట్, డాక్యుమెంట్ అప్రూవ్ అయితే, దాని డౌన్‌లోడ్ లింక్ వాట్సాప్‌కు వస్తుంది.
● అనంతరం దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
‘మీ సేవ’లు సులభతరం చేస్తూ
ప్రభుత్వ నిర్ణయం
మొబైల్ ద్వారా సర్టిఫికెట్లు
పొందే అవకాశం


