స్మార్ట్‌గా ఆలోచిస్తే మీరే లక్షాధికారి..!
నాగారం : ప్రపంచమంతా ప్రస్తుతం ఏఐ (కృత్రిమ మేథ) దిశగా పయనిస్తోంది. ఇలాంటి తరుణంలో ఏఐ రంగంలో విద్యార్థులు, యువత నుంచి నూతన ఆవిష్కరణలను స్వాగతించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, మై భారత్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ‘యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రతిభావంతులకు సరైన ప్రోత్సాహంతోపాటు మెరుగైన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ఎంపిక విధానం..
ప్రాథమిక ఎంపిక, ప్రాజెక్టును మెరుగుపర్చడం, ముఖాముఖి ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరిలో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో సదరు ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. నిపుణుల పరిశీలనలో ఎంపికై న ప్రాజెక్టును ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. విజేతలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఢిల్లీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఏఐ నిపుణుల కార్యశాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
వీరే అర్హులు..
● యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ పోటీల్లో పాల్గొనేందుకు 13 నుంచి 21ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.
● ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివేవారు అర్హులు.
● ఒకరు లేదా ఇద్దరు బృందంగా ఏర్పడి ఈ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
నగదు బహుమతులు
ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన మూడు బృందాలకు రూ.15 లక్షలు, ద్వితీయ స్థానంలో నిలిచిన మూడు బృందాలకు రూ.10లక్షలు, ప్రత్యే బహుమతి కింద రెండు బృందాలకు రూ.5లక్షల చొప్పున అందజేస్తారు.
ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30 వరకు https:/impact.indiaai.gov.in/eventsyuvaai వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రూపొందించాల్సిన
ప్రాజెక్టులు..
ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు, పరిజ్ఞానం, సృజనాత్మకత ఆలోచనలు, బాధ్యతాయుత వినియోగ పద్ధతులకు సంబంధించిన ఆలోచనలకు నిర్వాహకులు అధిక ప్రాధాన్యమిస్తారు. సామాజిక సాధి కారత, ప్రాథమిక రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా), స్మార్ట్ ఎకో సిస్టం, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర నగరాలు, ఓపెన్ ఇన్నోవేషన్, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో ప్రాజెక్టులు రూపొందించాలి.
విద్యార్థుల నుంచి నూతన
ఆవిష్కరణలను స్వాగతిస్తున్న కేంద్రం
ఎంపికై న వారికి మెరుగైన అవకాశాలు
ఈ నెల 30 వరకు దరఖాస్తులకు
అవకాశం


