జీఎన్‌ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు
నల్లగొండ టౌన్ : ప్రైవేట్ జీఎన్‌ఎం(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు పూర్తి వివరాలు ఆన్‌లైన్ వెబ్‌సైట్ dme.tealnga na.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.
దర్వేశిపురం వద్ద 25న బహిరంగ వేలం
కనగల్ : మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద వివిధ వస్తు విక్రయ హక్కులను ఏడాది కాలానికి (2026) కల్పించేందుకు ఈనెల 25న టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లడ్డూ, పులిహోరకు రూ.2 లక్షలు, గాజుల అమ్మకానికి రూ.1 లక్ష, బొమ్మలు, కిరాణ సామగ్రి అమ్మకానికి రూ.50 వేలు, ఆలయ ఫంక్షన్ హాల్ నిర్వహణకు రూ.50 వేలు, దేవస్థానం వద్ద ఫొటోలు తీసేందుకు రూ.20 వేల చొప్పున డీడీ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. 25వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు డీడీని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్‌లో వేయాలని పేర్కొన్నారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
కొండమల్లేపల్లి : పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లక్ష్మీ ప్రభ సూచించారు. శనివారం స్థానిక శ్రీ క్రాంతి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమయానుకూలంగా పరీక్ష పత్రాలను డౌన్‌లోడ్ చేసుకొని నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట సిట్టింగ్ స్క్వాడ్ సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ గుంటోజు ఆంజనేయులు, ఏఓ యర్రమాద గోవర్దన్‌రెడ్డి, నరేంద్రచారి తదితరులున్నారు.
ఎన్‌జీ కళాశాలలో రక్తదానం
రామగిరి (నల్లగొండ): ఎన్‌సీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 బెటాలియన్ పోలీసులు, ఎన్‌సీసీ కేడెట్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మేజర్ మాధవరావు, కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, సమన్వయకర్త చిలుముల సుధాకర్, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలి
నల్లగొండ టౌన్: బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఆయన నల్లగొండలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల, రాజకీయ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలన్నారు. లేని పక్షంలో వాటిని బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చీర పంకజ్ యాదవ్, కొలగాని పర్వతాలు, వెంకటాచారి, చెన్నయ్య, మిర్యాల యాదగిరి, అయితగోని జనార్దన్‌గౌడ్, అబ్దుల్ ఖదీర్, గజ్జి అజయ్ యాదవ్, మార్గం సతీష్, చిలకరాజు సతీశ్‌కుమార్, వడ్డెబోయిన రామకృష్ణ, చెన్నూరి భరద్వాజ్ యాదవ్, అనంత నాగరాజుగౌడ్, గడగోజు విజయ్, కర్నాటి యాదగిరి, తలారి యాదగిరి, పగిల్ల సైదులు, సతీశ్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.
జీఎన్‌ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు


