
జీవాలకు పీపీఆర్ వ్యాక్సినేషన్
పెంపకందారులు
సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ అగ్రికల్చర్ : మేకలు, గొర్రెలకు పీపీఆర్ (పెస్టిడిస్ పైటెటిస్ రూమి నాంట్స్) వ్యాధి నిరోధక టీకాలను వేయనున్నారు. జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాలు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి అవసరమైన 54 బృందాలను ఏర్పాటు చేసి, వ్యాక్సిన్ సిద్ధం చేశారు. అన్ని పశువైద్యశాలలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక, పశు వైద్య కేంద్రాలకు వ్యాక్సిన్ పంపుతున్నారు. ఆయా బృందాలు ఉదయం 7 గంటలకే గ్రామాలకు చేరుకుని 12 గంటల వరకు గొర్రెలు, మేకలకు టీకాలు వేయనున్నారు.
వ్యాధి వ్యాప్తి చెందే విధానం..
గొర్రెలు, మేకలలో మార్‌బిల్లివైరస్ వల్ల పీపీఆర్ అనే అంటు వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి జీవాలకు సరైన గాలి, వెలుతురు అందకపోవడం, కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం, వర్షాల వల్ల వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన జీవాలు మందలో ఉండడం వల్ల ఇతర జీవాలకు ఈవ్యాధి సోకుతుంది. వ్యాధి వచ్చిన జీవాలు విసర్జించే పేడ, స్రవాల ద్వారా ఈ వ్యాధి ఇతర జీవాలకు సోకుతుంది.
వ్యాధి లక్షణాలు..
వ్యాధి సోకిన గొర్రెలు, మేకల్లో అధిక జ్వరం రావడం కంటి నుంచి ముక్కు నుంచి నీరు కారడం, నోటిలో పొక్కులు ఏర్పడి జిగురుతో కూడిన విరేచనాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని పారుడు వ్యాధి అంటారు. ఈ వ్యాధి ముదిరినప్పుడు ముక్కు నుంచి చీము కారడం, నోటిలోని చిగుళ్లపై, నాలుకపై పుండ్లు ఏర్పడతాయి. వ్యాధి సోకిన జీవాలు ఆకలి మందగించి మేత తినకపోవడం, విరేచనాలు, దగ్గు వంటి లక్షణాలతో 5 నుంచి 10 రోజుల్లో మరణిస్తాయి.
వ్యాధి నిర్ధారణ, చికిత్స ఇలా..
చనిపోయిన జీవాలు శవ పరీక్ష చేసినప్పుడు చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రక్తపు చారలు కనిపించడం ద్వారా శ్వాసకోశ, జీర్ణావస్థకు సంబంధించిన లక్షణాల ద్వారా వ్యాధిని గుర్తింవచ్చు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. పశు వైద్యులను సంప్రదించి చికిత్స అందించడం ద్వారా జీవాలను కాపాడుకోవచ్చు. పశువైద్యుడి సలహా మేరకు వ్యాధి లక్షణాలు బట్టి యాంటి బయాటిక్ మందులు వాడుకోవాలి. నోటి పుండ్లు తగ్గడానికి బోరిక్ యాసిడ్ కలిపిన గ్లిజరిన్ పూయాలి. మేత మేయని జీవాలకు జావ, అంబలి తాగించాలి.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు పీపీఆర్ టీకాలు వేయనున్నాం. గొర్రెల, మేకల పెంపకందారులు, తమ గొర్రెలు, మేకలకు టీకాలను విధిగా వేయించుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
డాక్టర్ జి.వి.రమేష్,
జిల్లా పశు వైద్య సంవర్థక శాఖ అధికారి
ఫ 26 నుంచి సెప్టెంబర్
10వ తేదీ వరకు గ్రామాల్లో టీకాలు
ఫ 54 బృందాలను ఏర్పాటు చేసిన
పశు సంవర్థక శాఖ