
ఎన్‌ఎఫ్‌బీఎస్ దరఖాస్తులు సమర్పించాలి
నల్లగొండ : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) కింద అర్హత ఉన్న వారి దరఖాస్తులను వారం రోజుల్లోగా సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె కలెక్టరేట్‌లో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు జనవరి 1, 2024 నుంచి మరణించిన వారి వివరాలను సేకరించి ఎంపీడీఓలకు పంపాలన్నారు. ఎంపీడీఓలు ఆ జాబితాను తహసిల్దార్లకు సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు జాబితాను పంపించాలని చెప్పారు. జిల్లాలో అర్హత ఉన్న వారంతా లబ్ధి పొందేవిధంగా కృషి చేయాలన్నారు. శనివారంలోపు తహసీల్దార్లు దరఖాస్తులన్నీ పరిశీలించి ఆర్డీఓకు పంపాలని.. ఆర్డీఓలు ఆన్‌లైన్‌లో జిల్లా రెవెన్యూ అధికారికి సమర్పించాలని పేర్కొన్నారు. అనంతరం తాను పరిశీలించి ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య పాల్గొన్నారు.
కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి
దేవరకొండ : గ్రామీణ ప్రాంత ప్రజలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం దేవరకొండ మండలం బొడ్డుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు, ఐరన్, ఫోలిక్ మాత్రల పంపిణీ, నమోదైన సీజనల్ వ్యాధుల వివరాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని ముదిగొండ ప్రభుత్వ ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. వంటగది నుంచి బయటికి వెళ్లే వృథా నీరు, బాత్ రూమ్‌లకు ఓపెన్ డ్రెయినేజీ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి