
రిజర్వేషన్లకు మించి..
అన్ని పార్టీలు అమలు చేస్తేనే మేలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైనే రాజకీయ పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు, వారు గెలుపొందిన స్థానాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. వారికి కేటాయించిన స్థానాలతోపాటు, జనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసి సర్పంచ్‌లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు పలు అడ్డంకులు ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా అమలు చేసే యోచనతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అన్ని పార్టీలు అమలు చేస్తాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో 23 శాతం రిజర్వేషన్..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2019 ఎన్నికల్లో బీసీలు తమకు ఉన్న రిజర్వేషన్లకు మించి స్థానాలను దక్కించుకున్నారు. రిజర్వు అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో అధిక సీట్లను కై వసం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే 23 శాతం రిజర్వేషన్ స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసి 40 శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందినట్లు రాజకీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. మరోవైపు ఎంపీటీసీ స్థానాల్లోనూ 35 శాతం వరకు, జెడ్పీటీసీ స్థానాల్లోనూ 25 శాతం వరకు స్థానాలను సాధించారు.
జనరల్ స్థానాల్లో గెలుపు ఇలా..
● నల్లగొండ జిల్లాలో 844 సర్పంచ్ స్థానాలు ఉండగా.. బీసీ రిజర్వేషన్ కింద 209 స్థానాలతోపాటు 79 జనరల్ స్థానాల్లోనూ బీసీలే పోటీ చేసి విజయం సాధించారు. మొత్తంగా 288 స్థానాలను (35 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 346 ఎంపీటీసీ స్థానాల్లో రిజర్వుడ్ స్థానాలు 93తోపాటు 23 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. మొత్తంగా 121 స్థానాలను బీసీలు దక్కించుకున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ రిజర్వుడ్ స్థానాలు 4తో పాటు మరో 4 జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి.. 8 స్థానాల్లో గెలుపొందారు.
● సూర్యాపేట జిల్లాలోనూ 475 సర్పంచ్ స్థానాలకు గాను బీసీ రిజర్వుడ్ స్థానాలు 171తోపాటు మరో 52 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది.. 233 స్థానాలను (47 శాతం) బీసీలు దక్కించుకున్నారు. 255 ఎంపీటీసీ స్థానాల్లో 29 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 50 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 79 స్థానాలను కై వసం చేసుకున్నారు. 23 జెడ్పీటీసీ స్థానాల్లో 3 రిజర్వుడ్ స్థానాలతోపాటు మరో 2 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తంగా 5 జెడ్పీటీసీ స్థానాలను సాధించారు.
● యాదాద్రి భువనగిరి జిల్లాలోని 420 సర్పంచ్ స్థానాల్లో బీసీ రిజర్వుడ్ 117 స్థానాలతోపాటు 59 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి.. 176 స్థానాలను (42 శాతం) కై వసం చేసుకున్నారు. 117 ఎంపీటీసీ స్థానాల్లో 39 రిజర్వుడ్ స్థానాలతోపాటు 12 జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి మొత్తం 51 స్థానాలను బీసీలు సాధించారు. 17 జెడ్పీటీసీ స్థానాల్లో 4 బీసీ రిజర్వుడ్ స్థానాలతోపాటు మరొక జనరల్ స్థానంలో పోటీ ఐదింటిని దక్కించుకున్నారు.
ఫ ఈసారి బీసీలకు
42 శాతం సీట్లు ఇచ్చేలా కసరత్తు
ఫ ప్రభుత్వ పరంగా కుదరకపోతే
పార్టీ పరంగా అమలు
చేస్తామంటున్న కాంగ్రెస్
ఫ మిగతా పార్టీలూ బీసీలకు ప్రాతినిధ్యం పెంచక తప్పని పరిస్థితి
ఫ రిజర్వేషన్ల అమలుపై
పార్టీల్లో విస్తృత చర్చ
గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పరంగా చేస్తేనే మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఒకపార్టీ 42 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు సీటు కేటాయించినా, అక్కడ మరో పార్టీ జనరల్ అభ్యర్థిని నిలబెడితే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేసేందుకు తీర్మానం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా సానుకూల నిర్ణయం వెలువడలేదు. కేంద్రం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే పరిస్థితిలేదు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.