
విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలి
హాలియా : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు వారి పరిధిలోని పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె హాలియాలోని 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణ పనులను, ఆస్పత్రిలో ఓపీ, ఏఎన్‌సీ, మందులు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న తలసేమియా, ప్రసవాలు, సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగీ, టైపాయిడ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో సరిపడా వైద్యుల నియామకంపై దృష్టి సారించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్‌ను ఆదేశించారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవి, డాక్టర్ రామకృష్ణ, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓ లక్ష్మి తదితరులు ఉన్నారు.