
నేటి నుంచి పోస్టాఫీస్ పనివేళల్లో మార్పు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ హెడ్ పోస్టాఫీస్ కార్యాలయం పనివేళలను గురువారం నుంచి మార్చుతున్నట్లు జిల్లా సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి బుధవారం తెలిపారు. స్టాంపులు, పార్సిళ్లు, స్పీడ్ పోస్టు, మనీ ఆర్డర్ల లావాదేవీలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తామని, సేవింగ్స్ బ్యాంక్, సర్టిఫికెట్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాధ్నాం 3 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫిర్యాదు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తత అవసరం
తిప్పర్తి : సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాదికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్క, పాము కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డెంగీ, మలేరియా తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ప్రదీప్‌బాబు, డాక్టర్ మమత సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత
లక్ష్యాలను సాధించాలి
గుర్రంపోడు : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని డీఈఓ భిక్షపతి కోరారు. బుధవారం గుర్రంపోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠాలు బోధించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని ఈ సందర్భఃగా పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈఓ నోముల యాదగిరి, హెచ్‌ఎం సంధ్యారాణి తదితరులు ఉన్నారు.
23న ఎన్‌ఎస్‌ఎస్
వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీయూ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల నుంచి వలంటీర్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జాతీయ సేవ పథకం కో ఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్, హిందీ, నాయకత్వ లక్షణాలు, కల్చరల్ అంశాల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు వచ్చే నెల 18 నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్‌లో జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి హాజరు కావడానికి అర్హత సాధిస్తారని తెలిపారు.
ఏటీసీ, ఐటీఐ కోర్సుల పోస్టర్ ఆవిష్కరణ
నల్లగొండ: నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ, డైట్ కాలేజీలో బుధవారం ఏటీసీ, ఐటీఐలలో కొత్తగా ప్రవేశపెట్టిన 6 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కోర్సులపై అవగాహన కల్పించే పోస్టర్‌ను డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు నల్లగొండలోని పాత ఐటీఐ కాలేజీ, కొత్త ఐటీఐ కాలేజీ, అనుముల, డిండి ఐటీఐ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అరవిందరెడ్డి, నరేందర్, దామోదర్ పాల్గొన్నారు.

నేటి నుంచి పోస్టాఫీస్ పనివేళల్లో మార్పు

నేటి నుంచి పోస్టాఫీస్ పనివేళల్లో మార్పు