
సమగ్రాభివృద్ధి సాధించేలా..
ఎన్నో విషయాలను నేర్చుకున్నాం
మానసిక స్థైర్యం నింపడమే లక్ష్యం
పెద్దవూర : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సమగ్రాభివృద్ధి సాధించేలా గిరిజన సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యుక్త వయస్సులోని బాల, బాలికలకు చదువుతో పాటు ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ చాలా ప్రధానం. శారీరక మార్పులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటారు. వీటిపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన వాయిస్ 4 ఎన్‌జీఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాయ్స్ అండ్ గర్‌ల్స్ 4 చేంజ్ ఫైర్ ఫైల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని ఆరు ఆశ్రమ పాఠశాలలు ముదిగొండ, దేవరకొండ, తెల్దేవర్‌పల్లి, అయిటిపాముల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలు, దేవరకొండ, పెద్దవూర బాలుర ఆశ్రమ పాఠశాలల్లోని ఏడు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుంచి కౌన్సిలర్లచే పదిరోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ 14వ తేదీన ముగిసింది.
రోజుకో అంశంపై శిక్షణ..
పది రోజుల శిక్షణలో రోజుకు ఒక అంశంపై విద్యార్థులకు శిక్షణ నిచ్చారు. కలల నుంచి వాస్తవిక జీవితం, విజయం ఎలా సాధించాలి, ఉద్యోగాల్లోని రకాలు, ఆరోగ్య జీవన విధానం, హక్కులు, విధులు, కౌమరదశలో వచ్చే మార్పులు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ సాగింది. అకాడమిక్, నాన్ అకాడమిక్ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ, నాణ్యమైన ఉన్నత విద్య, విభిన్న రంగాల్లో ఉపాధి పొందేందుకు కావాల్సిన నైపుణ్యాలను సాధించటమే లక్ష్యంగా బాల, బాలికలకు శిక్షణ సాగింది. గ్రూపు డిస్కషన్ నిర్వహించి వారి ప్రాంతాల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను బోధించారు. శిక్షణ చివరి రోజు శిక్షణకు సంబందించిన సర్టిఫికెట్లు అందజేశారు.
ఫ గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు శిక్షణ
ఫ జిల్లాలో ఆరు పాఠశాలల్లో పది రోజులపాటు కార్యక్రమం
ఫ ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్న విద్యార్థులు
పది రోజుల శిక్షణలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. కమ్యునికేషన్ స్కిల్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నేర్చుకున్నాం. చదువుతో పాటు సమాజంలో ఎలా మసలుకోవాలో నేర్పించారు. పది రోజుల శిక్షణ ఎంతో సరదాగా, సంతోషంగా సాగింది. ఈ అంశాలను నిజ జీవితంలో అన్వయించుకుంటాం.
– డి.హర్షవర్థన్, 8వ తరగతి,
పెద్దవూర ఆశ్రమ పాఠశాల
ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మంది చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉంటారు. వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి వాటిని ఎదుర్కొనేలా ప్రేరణ కల్పించాం. లింగ వివక్ష, సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఈ శిక్షణ అవకాశం కల్పించింది. చిన్నతనం నుంచే సమాజంపై గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేలా శిక్షణ ఉపయోగపడింది.
– ముఢావత్ చత్రు, డీటీడీఓ, నల్లగొండ

సమగ్రాభివృద్ధి సాధించేలా..

సమగ్రాభివృద్ధి సాధించేలా..