
నీలగిరిలో జంతు వధశాల
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో ఎన్నో ఏళ్లుగా జంతు వధశాల (స్లాటర్ హౌస్) ఏర్పాటుకు అడుగుల పడుతున్నాయి. నగర అభివృద్ధి పథకంలో భాగంగా సీడీఎంఏ ప్రత్యేక నిధుల ద్వారా మున్సిపాలిటీకి రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల్లో రూ.5 కోట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవతో జంతు వధశాల నిర్మాణానికి కేటాయించారు. నిర్మాణ పనుల కోసం త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం సిద్ధమవుతోంది.
రోడ్లపై కోయడంతో ఇబ్బందులు
నీలగిరి పట్టణంలో ఇప్పటి వరకు జంతు వధశాల లేదు. దీంతో మాంసం వ్యాపారులు పానగల్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, ప్రధాన కూడళ్లలో కూడా రోడ్ల మీదనే జంతువులను వధిస్తున్నారు. దీంతో వాటి వ్యర్థాల కారణంగా ఆ ప్రదేశాలు దుర్గందం వెదజల్లుతున్నాయి. దోమలు, ఈగలు వ్యాప్తి కూడా పెరుగుతోంది. దీనిపై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు మంత్రి కోమటిరెడ్డి చొరవతో త్వరలోనే జంతు వధశాల నిర్మాణం కానుంది. జంతు వధశాల నిర్మాణం కోసం కలెక్టరేట్ వెనుక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. ఈ స్థలంలోనే జంతు వధశాల నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
వెటర్నరీ వైద్యుడు ధ్రువీకరించిన తర్వాతే..
నీలగిరి పట్టణంలో వందలాది యాట పోతులు కోస్తున్నా వాటిని ఏ అధికారి కూడా పరీక్షించలేదు. వాటిల్లో నాణ్యమైనవి ఏవో గుర్తించే అవకాశాలు లేకపోవడంతో వినియోగదారులకు కూడా నాణ్యమైన మాంసం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వధశాల అందుబాటులోకి వచ్చిన తర్వాత వెటర్నరీ వైద్యుడు వ్యాపారులు తెచ్చిన జంతువులను పరీక్షించి ఆరోగ్యంగా ఉందని ధ్రువీకరించిన తర్వాతే వాటిని వ్యాపారులకు అప్పగిస్తారు. పశు వైద్యులు తిరస్కరిస్తే సంబంధిత యాట పోతులను వధించడానికి వీలు లేదు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యాపారులకు మున్సిపల్ యంత్రాంగం జరిమానాలు విధించనుంది. దీంతో వినియోగదారులకు నాణ్యమైన మాంసం లభించనుంది.
ఫ రూ.5 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు
ఫ కలెక్టరేట్ వెనుక స్థలం కేటాయింపు
ఫ తీరనున్న వ్యాపారులు, వినియోగదారుల ఇబ్బందులు