
సరిహద్దులో రేషన్ బియ్యం దందా!
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం
రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసినా, దందాకు సహకరించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అక్రమ దందాపై సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు సరైన పారితోషకాన్ని అందిస్తాం. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తాం.
– రాజశేఖర్‌రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ
మిర్యాలగూడ ప్రాంతంలో ఆగని అక్రమ వ్యాపారం
ఫ పీడీ యాక్ట్ నమోదు
చేస్తున్నా షరామామూలే..
ఫ ఏపీకి చెందిన వ్యాపారులే
సూత్రధారులు
ఫ ఇరు రాష్ట్రాల సరిహద్దు
గ్రామాల్లో కొనుగోలు
ఫ పల్నాడు జిల్లాలో మిల్లులకు విక్రయం
ఫ అక్కడ పాలిష్ చేసి ఇతర
రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా
మిర్యాలగూడ : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టి పట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నా.. చివరికి పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నా మిర్యాలగూడ ప్రాంతంలో రేషన్ బియ్యం దందా మాత్రం ఆగడం లేదు. గతంలో తెలంగాణ నుంచి ఏపీ రాష్టానికి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగేది. కానీ, ఇప్పుడు ఇక్కడి వారి సహాయంతో ఏపీకి చెందిన వ్యాపారులు కొందరు ఇక్కడా అక్కడా తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని మిల్లులకు అమ్ముతున్నారు. ఆ బియ్యాన్నే మిల్లుల యజమానులు పాలిష్ చేసి తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటు న్నారు. తాజాగా రాష్ట్ర సరిహద్దులోని మిర్యాలగూడ పరిధిలో గల వాడపల్లి చెక్ పోస్టు వద్ద 600 బస్తాలు (300 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇందులో అరెస్టయిన వారంతా ఏపీకి చెందిన వారు కావడం గమనార్హం.
కిలో పది రూపాయలకు కొని..
తెలంగాణలో ఆరు నెలలుగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. పక్కనున్న ఏపీ రాష్ట్రంలో దొడ్డు బియ్యాన్ని అందిస్తున్నారు. సరిహద్దులో ఉన్న తెలంగాణ గ్రామాల నుంచి ఏపీకి చెందిన కొందరు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.11కు కొనుగోలు చేసి మిల్లులకు అమ్ముకుంటున్నారు. అలాగే సరిహద్దులోని ఇరు రాష్ట్రాలకు చెందిన గ్రామాల రేషన్ షాపుల డీలర్లు కూడా కిలోకు రూ.10 నుంచి 12 వరకు లబ్ధిదారుల నుంచి కొని మిల్లులకు కిలోకు రూ.25 నుంచి రూ.30ల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు మిల్లుల యజమానులు ఆ రేషన్ బియ్యాన్ని సన్నగా పాలిష్ చేయించి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి ప్రత్యేక వాహనాల్లో వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తూ కిలో రూ.40 నుంచి రూ.50లకు అమ్ముంటున్నారు.
నకిలీ బిల్లులు సృష్టించి..
ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని ఓ రైస్ మిల్‌లో పనిచేసే ఓ గుమస్తా తమ జిల్లాకు సరిహద్దులో ఉన్న తెలంగాణ పల్లెల్లో రేషన్ బియ్యం సేకరించి అదే మిల్లుకు తరలిస్తూ పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి తెల్ల సంచుల్లో నింపి ఇతర రాష్టాలకు తరలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రాష్ట్ర సరిహద్దు దాటించేందుకు ఒక ఏజెంట్‌ను నియమించుకుని అతనికి నెలకు రూ.3లక్షలకుపైగా కమీషన్ ఇస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులకు చిక్కని సూత్రధారులు..
ఇటీవల రాష్ట్ర సరిహద్దులోని వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుకున్నప్పటికీ అసలు సూత్రధారులు ఇప్పటివరకు చిక్కలేదు. ఆ సూత్రధారులకు ఏపీలో అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు జంకుతున్నారు. ఇప్పటివరకు అనేక మంది రేషన్ బియ్యం అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసినా దందా ఆగడం లేదు. ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యం కేసులో ఎనిమిది మందికిగాను ఐదుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు అసలు సూత్రధారులు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారంతా ఏపీ రాష్ట్రానికి చెందిన వారే.

సరిహద్దులో రేషన్ బియ్యం దందా!