నీలగిరికి రింగ్ రోడ్డు!
రెండు బైపాస్‌లు, ఒక హైవే కలుపుకొని నిర్మాణం
ఎన్‌హెచ్ బైపాస్‌కు భూసేకరణ..
జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నార్కట్‌పల్లి – అద్దంకి జాతీయ రహదారికి మాచర్ల – నకిరేకల్ జాతీయ రహదారిని అనుసంధానించేలా గత ఏడాది ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి మూడు ప్రతిపాదనలను సిద్ధం చేయగా, మూడో ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పానగల్ నుంచి నార్కట్‌పల్లి– అద్దంకి హైవే వెంట మర్రిగూడ బైపాస్ జంక్షన్ వరకు వచ్చి, అక్కడ నుంచి మర్రిగూడ శివారు ప్రాంతం మీదుగా దేవరకొండ రోడ్డు అక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో సాగర్ రోడ్డుకు కలిపే 3వ ఆప్షన్ అలైన్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఓకే చేశారు. 15.5 కిలోమీటర్ల పొడవునా నాలుగు లేన్లుగా ఈ రోడ్డును నిర్మించేందుకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. ప్రస్తుతం భూసేకరణకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అది పూర్తి కాగానే రోడ్డు నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీలగిరి పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు రాబోతోంది. ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఒక బైపాస్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టగా, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరో బైపాస్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. దీంతో పట్టణానికి ఒకవైపు నార్కట్‌పల్లి – అద్దంకి జాతీయ రహదారి ఉండగా, మరోవైపు జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో బైపాస్ రానుండగా, ఇంకోవైపు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరో బైపాస్ వేయడం ద్వారా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు రానుంది. ఇందులో భాగంగా రూ.250 కోట్లతో బైపాస్‌ను నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలను పంపించింది. నాగార్జునసాగర్ రోడ్డులోని మెడికల్ కాలేజీ సమీపం నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు ఈ బైపాస్‌ను నిర్మించనుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే తదుపరి కార్యాయరణ చేపట్టనుంది. ఈ రెండు బైపాస్‌లు పూర్తయితే పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు రానుంది.
రింగ్ రోడ్డు నిర్మాణం మంత్రి లక్ష్యం
నల్లగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్లు భవనాల శాఖను చూస్తున్నారు. పట్టణానికి రింగ్ రోడ్డు వేయాలన్నది ఆయన లక్ష్యం. అందులో భాగంగానే ఆయన మంత్రి అయినప్పటి నుంచి పట్టణానికి రింగ్ రోడ్డు వేస్తానని చెబుతూ వచ్చారు. అయితే పట్టణం మధ్యలో నుంచి మాచర్ల – నకిరేకల్ జాతీయ రహదారిని గతంలో ప్రతిపాదించారు. పట్టణం వెలుపల ఇటు నకిరేకల్ వైపు, అటు మాచర్ల వైపు రోడ్డు పూర్తయిపోయింది. పట్టణంలో జాతీయ రహదారి వేయాలంటే పట్టణంలో విస్తరణ పనులు చేయాల్సి ఉంది. ఆ విస్తరణలో పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది. మరోవైపు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాతీయ రహదారిని(ఎన్‌హెచ్) మార్చాలని ప్రజలు, వివిధ పార్టీల నేతలు పట్టుబట్టారు. దీంతో ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో మాట్లాడి, పట్టణం బయటనుంచి వెళ్లేలా చూడాలని కోరడంతో అందుకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పానగల్ నుంచి నార్కట్‌పల్లి– అద్దంకి హైవే వెంట మర్రిగూడ బైపాస్ జంక్షన్ మీదుగా, దేవరకొండ రోడ్డు, అక్కడ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో సాగర్ రోడ్డుకు బైపాస్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం ఓకే చెబితేనే రింగ్..
ఇక రెండో బైపాస్ రోడ్డును సాగర్ రింగ్ రోడ్డునుంచి అనిశెట్టి దుప్పలపల్లి వద్ద నార్కట్‌పల్లి – అద్దంకి జాతీయ రహదారికి కలిపేలా ఆర్ ఆండ్ బీ శాఖ కొత్త బైపాస్‌ను ప్రతిపాదించింది. 10.5 కిలోమీటర్ల పొడవునా దీనిని నాలుగు లేన్లుగా నిర్మించనున్నారు. రూ.250 కోట్లతో చేపట్టే ఈ రహదారి ప్రతిపాదలకు ప్రభుత్వం ఒకే చెబితే నల్లగొండకు రింగ్ రోడ్డు కల సాకారం కానుంది.
జాతీయ రహదారుల మధ్య బైపాస్ రోడ్డుకు ఇప్పటికే టెండర్లు
మర్రిగూడ ఫ్లై ఓవర్ నుంచి మెడికల్ కాలేజీ వరకు త్వరలో పనులు
మెడికల్ కాలేజీ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు మరో బైపాస్
ఈ రోడ్డుకు రూ.250 కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఆర్‌అండ్‌బీ
ప్రభుత్వ ఆమోదం లభించగానే
తదుపరి కార్యాచరణ


