
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
చౌటుప్పల్ : ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో శని వారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన మేకల మహేందర్(26) కొన్నేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం లక్కారం గ్రామానికి వచ్చాడు. స్థానికంగా అద్దెకు ఉంటూ రిఫ్రిజిరేషన్ పని చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతికి గల కారణాలు తెలియలేదు. మృతుడి తండ్రి సదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
అనంతగిరి : ప్రమాదవశాత్తు కాలుజారి ఊరచెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతగిరి మండలం వాయిలసింగారంలో శనివారం చోటుచేసుకుంది. అనంతగిరి ఎస్‌ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వాయిల సింగారం గ్రామానికి చెందిన దేవులపల్లి రామ్మూర్తి (45) శుక్రవారం తమ గేదెలను వెతుక్కుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి ఊర చెరువులో పడ్డాడు. ఈతరాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. శనివారం స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతని భార్య దేవులపల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.