చలికి జాగ్రత్తలు తప్పనిసరి
నల్లగొండ టౌన్ : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చలికాలం సీజన్‌లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, జాగ్రత్తలపై సాక్షి బుధవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్‌తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు చలి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆయన మాటల్లోనే..
ప్రశ్న : చలి తీవ్రత వల్ల మా గ్రామంలో జనం జ్వరాల బారిన పడుతున్నారు. వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలి.
–అంజాన్‌హాన్, ఇబ్రహీంపట్నం
డీఎంహెచ్‌ఓ : హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు తగిన దేశాలను ఇస్తున్నాం. వెంటనే గ్రామానికి పంపించి జ్వర పీడితులకు రక్త పరీక్షలను చేయించి మందులు కూడా అందించేలా చూస్తాం.
ప్రశ్న : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉంది. వెంటనే కొత్త భవనాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి.
–వెంకటేశ్వర్లు, చండూరు, శంకర్, చండూరు,
డీఎంహెచ్‌ఓ : ఇప్పటికే కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాం.
ప్రశ్న : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలి. –పి.రవీందర్, చందంపేట
డీఎంహెచ్‌ఓ : సమయపాలన పాటించని వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చూస్తాం.
ప్రశ్న : డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దోమల బెడద ఎక్కువైంది. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. – రమేష్, మాజి కౌన్సిలర్,
నందికొండ, ఆవుల కృష్ణ, తిప్పర్తి.
డీఎంహెచ్‌ఓ : వెంటనే వైద్య సిబ్బందికి ఆదేశాలను జారీ చేసి డ్రెయినేజీల్లో మందుల నివారణకు మందు చల్లించడానికి చర్యలు తీసుకుంటాం. ఎవరైనా జ్వరాల బారిన పడితే సిబ్బందిని అప్రమత్తం చేసి వైద్యసేవలు అందిస్తాం.
ఫ చిన్నారులు, వృద్ధుల పట్ల
ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఫ అనారోగ్యానికి గురైతే వెంటనే
వైద్యులను సంప్రదించాలి
ఫ ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్
ప్రశ్న : చలి తీవ్రంగా ఉంది. చిన్నారులు, వృద్ధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
– సత్యనారాయణ, నల్లగొండ,
శ్రీశైలం యాదవ్, చందంపేట,
లింగయ్య, మునుగోడు.
డీఎంహెచ్‌ఓ : చిన్నపిల్లలు, వృద్ధులు చలిలో తిరగకుండా చూడాలి. వెచ్చదనం కోసం స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లను పెట్టుకునేలా చూడాలి. చలిలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి. చల్లని పానీయాలు తాగకుండా వేడి చేసిన నీటిని తాగాలి. పాలుతాగే చిన్నపిల్లలను తల్లిపొత్తిల్లలో పడుకోబెట్టాలి. ఉదయం కొద్ది సేపు ఎండలో తిప్పాలి. పిల్లలకు అవసరమైన టీకాలు వేయించాలి. దీర్ఘకాలిక రోగులు తగిన జగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి వేళల్లో చలిరాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచి వేడిన ఇచ్చే హైవోల్టేజి బల్బులను వేసుకోవాలి. ఏసీలు, కూలర్లను వాడవద్దు. ఏమైన ఆరోగ్య సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
చలికి జాగ్రత్తలు తప్పనిసరి


