నకిరేకల్: సరుకులు కొనేందుకు కిరాణ దుకాణం వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి షాపు యాజమాని ఫోన్ తీసుకుని ఫోన్ పే ద్వారా రూ.90వేలు ట్రాన్స్‌ఫర్ చేసుకుని పరారయ్యాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో మంచుకొండ రాధాకిషన్ నిర్వహిస్తున్న కిరాణ షాప్‌కు ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి వచ్చారు. తనకు కావల్సిన సరుకుల లిస్ట్‌ను షాపు యాజమాని మంచుకొండ రాధాకిషన్‌కు ఇచ్చాడు. షాపు యాజమాని సరుకులు కట్టే పనిలో నిమగ్నం కాగా.. ఇంటికి ఫోన్ చేసి ఇంకా ఏమైనా సరుకులు కావాలా అని అడుగుతానని సదరు వ్యక్తి రాధాకిషన్ ఫోన్ అడిగాడు. దీంతో రాధాకిషన్ తన ఫోన్‌ను సదరు వ్యక్తికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి మూడు సార్లు రూ.90వేలు ఫోన్ పే ద్వారా వేరే నంబర్‌కి డబ్బులు పంపే ప్రయత్నం చేశాడు. పాస్‌వర్డ్ తెలియకపోవడంతో మూడు సార్లు ట్రాన్‌శాక్షన్ ఫెయిల్ అని పడింది. నాల్గోసారి సరైన పాస్‌వర్డ్ నమోదు చేయడంతో రూ.90 వేలు రేష్మాదేవి పేరుతో ఉన్న అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అనంతరం సదరు వ్యక్తి ఫోన్‌ను షాపు యాజమాని రాధాకిషన్‌కు ఇచ్చి.. నేను చికెన్ తెచ్చుకుని వస్తా సరుకులు కట్టి బిల్ చేసి పెట్టండని అక్కడ నుంచి ఉడాయించాడు. సదరు వ్యక్తి అరగంట అయినా రాకపోవడంతో రాధాకిషన్ తన భార్య లక్ష్మికి విషయం చెప్పాడు. అనుమానం వచ్చి రాధాకిషన్ ఫోన్‌ను అతడి భార్య చెక్ చేయగా.. రూ.90 వేలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి రాధాకిషన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును సైబర్ క్రైంకు బదిలీ చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైం వారు కేసు విచారణ చేస్తున్నారు.
సరుకుల కొనేందుకు వచ్చి ఫోన్ పే ద్వారా రూ.90వేలు ట్రాన్స్‌ఫర్
చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి


