నల్లగొండ : వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్‌కు 74 మంది దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది జిల్లా అధికారులు, ఆర్డీఓలు దరఖాస్తుపై స్పెషల్ గ్రీవెన్స్ అని రాస్తే త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయన్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ పాల్గొన్నారు.
పరిహారం పెంచేలా చూడండి
మాకు నలుగురు కొడుకులు. ప్రతి నెలా ఒకొక్కరు రూ.2500 చొప్పున 10 వేలు కొడుకులు ఇస్తున్నారు. చిన్న కొడుకు చనిపోయాడు. ఇప్పుడు రూ.7500 వస్తున్నాయి. అయితే పెద్ద కొడుకు టీచర్ అయినా ప్రతి నెల ఆలస్యంగా ఇస్తున్నాడు. కెనడాలో ఉండే కొడుకు, హైదరాబాద్‌లో ఉండే కొడుకు సమయానికి పంపిస్తున్నారు. కానీ ఆ రూ.7500 మా మందులకే సరిపోవడం లేదు. ఒకొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున ఇప్పించాలి.
– కేసాని లింగారెడ్డి–పద్మ,
కొడతాలపల్లి, త్రిపురారం మండలం
నా బిడ్డ భూమి తీసుకుంది..
పట్టించుకోవడం లేదు
నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. 7 ఎకరాల 23 గుంటల భూమి ఉంది. నా కొడుకులే 7 ఎకరాల భూమిని నా బిడ్డకు అమ్మారు. 23 కుంటల భూమిని నా పేరున ఉంచారు. నన్ను చూసుకుంటానని చెప్పి ఆ 23 కుంటల భూమిని కూడా నా కూతురే పట్టా చేయించుకుంది. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అడిగితే తిడుతోంది. కొడుకుల వద్దకు పోతే భూమి బిడ్డకు ఇచ్చావు అని పట్టించుకోవడం లేదు.
– లింగయ్య, చిన్నకాపర్తి, చిట్యాల మండలం
పింఛన్ ఇప్పించండి
నేను దివ్యాంగుడిని. మా అమ్మ కూడా మానసిక దివ్యాంగురాలు. నాన్న లేడు. అమ్మకు గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చింది. ప్రస్తుతం ఆగిపోయింది. దాంతో మాకు కుటుంబం గడవడం కష్టంగా ఉంది. మా అమ్మకు పింఛన్ ఇప్పించాలి.
– సాలోజు నాగయ్య, తడకమళ్ల, మిర్యాలగూడ మండలం
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రత్యేక ప్రజావాణి దరఖాస్తులపై శ్రద్ధ చూపాలి
ప్రత్యేక ప్రజావాణి దరఖాస్తులపై శ్రద్ధ చూపాలి
ప్రత్యేక ప్రజావాణి దరఖాస్తులపై శ్రద్ధ చూపాలి