మచ్చలు ఉంటే చూపించుకోవాలి
శరీరంపై ఎక్కడైన మచ్చలు ఉంటే సర్వేకు వచ్చిన సిబ్బందికి చూపించాలి. లెప్రసి లక్షణాలు ఉంటే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు. సర్వేకు వచ్చిన వారికి సహకరించి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ
నల్లగొండ టౌన్ : కుష్టు వ్యాధిని సమాజం నుంచి పూర్తిస్థాయిలో పారదోలాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటా లెప్రసి కేస్ డిటెన్షన్ క్యాంపెయన్ (ఎల్‌సీడీసీ) చేపట్టింది. 2017 నుంచి సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించే ఈ సర్వేను సోమవారం జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఈ నెల 30వ తేదీ వరకు సర్వేను పూర్తి చేయనున్నారు. సర్వే కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 1,466 బృందాలను ఏర్పాటు చేసింది. పట్టణంలో అయితే రోజు 50 నుంచి 60 ఇళ్లను ఆశ వర్కర్లు సర్వే చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే 20 నుంచి 30 ఇళ్లలో సర్వే నిర్వహిస్తారు. సర్వేను మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, ప్రోగ్రాం అధికారులతో పాటు ఏఎన్‌ఎంలు పర్యవేక్షించనున్నారు.
పూర్తి శరీరం పరిశీలన
సర్వేలో భాగంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి పూర్తి శరీరాన్ని పరిశీలించి ఎర్ర మచ్చలు, స్పర్శలేని మచ్చలు, నరాల బలహీనత ఉందా లేదా చేతులు కాళ్ల వేళ్లు, తిమ్మిర్లు, బొగ్గలు వాటన్నింటిని ఆశా వర్కర్లు పరిశీలిస్తారు. వారిలో ఏవైనా కుష్టు వ్యాధి లక్షణాలు ఉంటే మెడికల్ ఆఫీసర్ రెఫర్ చేస్తారు. మెడికల్ ఆఫీసర్ పరీక్షించి కుష్టు లక్షణాలు ఉంటే వారిని బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరపి ఎండీటీ) పద్ధతిన జిల్లా కేంద్రంలోని లెప్రసీ సెంటర్ ద్వారా చికిత్స అందించనున్నారు.
వ్యాధి లక్షణాలు ఇలా..
కుష్టు వ్యాధి (లెప్రసి)అనేది మైక్రో బ్యాక్టిరియన్ లెప్రో అనే బ్యాక్టిరియా వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా నరాలు, చర్మం, ముక్కుద్వారం ఎగువ శ్వాస నాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని గోదుమ రంగు, స్పర్శ లేని తిమ్మిరి మచ్చలు ఉంటే కుష్టు వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.
ఫ ఇంటింటా ఎల్‌సీడీసీ సర్వే
ఫ సర్వేలో 1466 బృందాలు
కుష్టువ్యాధి నిర్మూలనే లక్ష్యం


