నల్లగొండ : నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ కోరారు. నామినేషన్ల ప్రక్రియపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లను వేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500, ఇతరులు రూ.25 వేలను ఏదైనా జాతీయ బ్యాంకులో కొత్తగా ఖాతా తెరిచి డిపాజిట్ చేయాలన్నారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సందర్భంగా ప్రచురించే కరపత్రాల విషయంలో ప్రజా ప్రాతినిద్య చట్టంలోని 127 –ఏ నిబంధనలు పాటించాలని, పోటీ చేసే అభ్యర్థులు రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయొద్దని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.