కేతేపల్లి: తమకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమ తండ్రి అనారోగ్యం పాలై మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కొర్లపహాడ్ గ్రామానికి చెందిన గుండ్లపల్లి ఉపేందర్‌రావు తక్కువ ధరకు భూమి ఇప్పిస్తానని చెప్పి అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బయ్య భిక్షమయ్యయాదవ్ నుంచి 2017లో రూ.70లక్షలు తీసుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా ఉపేందర్‌రావు భిక్షమయ్యకు భూమి ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో భిక్షమయ్య గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. కాగా మూడేళ్ల క్రితం ఉపేందర్‌రావు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని భిక్షమయ్యకు రిజిష్ట్రేషన్ చేస్తానని పెద్ద మనుషుల సమక్షంలో హామీ ఇచ్చాడు. రిజిష్ట్రేషన్ చేసేంత వరకు ఆ భూమిని భిక్షమయ్య సాగు చేసుకునేందుకు కూడా ఉపేందర్‌రావు అంగీకరించాడు. మూడేళ్లవుతున్నా ఉపేందర్‌రావు భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోగా.. కొంతకాలంగా కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. లక్షల రూపాయల డబ్బులు పోవటంతో పాటు భూమి కూడా రాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షమయ్య అనార్యోగం బారిన పడ్డాడు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన భిక్షమయ్యను కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా శనివారం రాత్రి మృతిచెందాడు. భిక్షమయ్య మృతిచెందిన విషయాన్ని గ్రామస్తులు ఉపేందర్‌రావుకు తెలియజేసి గ్రామానికి రావాలని కోరారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరానని, రాలేనంటూ చెప్పాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఆదివారం భిక్షమయ్య మృతదేహాన్ని గ్రామంలో తాళం వేసి ఉన్న ఉపేందర్‌రావు ఇంటి ఆవరణలో ఉంచి అక్కడే మృతదేహాన్ని ఖననం చేస్తామంటూ గుంత తవ్వారు. విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్ద మనుషులతో చర్చలు జరిపారు. ఉపేందర్‌రావు గ్రామానికి తీసుకువచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లారు.


