ఫ ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి జగదీష్‌రెడ్డి ఒక్కరే గెలుపు
ఫ సూర్యాపేటలో 1967 తర్వాత హ్యాట్రిక్ సాధించిన మొదటి వ్యక్తి
సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి ఒకే ఒక్కడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గెలుపొందారు. ఆయనకు వరుసగా మూడో సారి విజయం వరించింది. 1967 తర్వాత జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించిన మొదటి వ్యక్త్తిగా రికార్డుకెక్కారు. 1952, 1957లో ఉప్పల మల్సూర్ సూర్యాపేట ద్విసభ్య నియోజకవర్గ ఎమ్మెల్యేగా, 1962, 1967లో మరో రెండుసార్లు గెలిచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత సాధించారు. ఆ తర్వాత ఆకారపు సుదర్శన్ రెండుసార్లు 1989,1994లో గెలుపొందారు. ఇక జగదీష్‌రెడ్డి వరుసగా 2014, 2018, 2023లో గెలుపొంది హ్యాట్రిక్ వీరుడిగా ఘనత సాధించారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో 1994లో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో తెలుగుదేశం, మిత్రపక్షాలు గెలుపొందగా.. తుంగతుర్తి స్థానంలో మాత్రం రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలుపొంది ఒకే ఒక్కడిగా నిలిచారు. ప్రస్తుతం 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. సూర్యాపేటలో మాత్రమే జగదీష్‌రెడ్డి గెలిచి ఒకే ఒక్కడిగా రికార్డు కెక్కారు.