‘అభ్యర్థి రవీంద్రకుమార్‌ను గెలిపిస్తే దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దేవరకొండ మున్సిపాలిటీని రూ.100కోట్లతో అభివృద్ధి చేశామని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడి గిరిజనులు తమ బిడ్డలను అమ్ముకున్నారని, ఫ్లోరోసిస్ సమస్య పట్టిపీడించిందని, ఈ విషయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేదన్నారు. ఒక్క చాన్స్ అంటూ కాంగ్రెస్ నాయకులువస్తున్నారని.. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం అయ్యిందా, గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలంతా ఒక్కటై సీఎం కేసీఆర్ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పార్టీ వారికి ఓట్లు వేస్తే మళ్లీ కనిపించరని, ఓట్లు పడగానే వారిని కలిసేందుకు ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ హయాంలో ఎంతో ప్రగతి
సీఎం కేసీఆర్ హయాంలో దేవరకొండ నియోజకవర్గం ఎంతో ప్రగతి సాధించిందని బీఆర్‌ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఇక్కడ అభివృద్ధి కావాలే తప్ప అరాచకం వద్దని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కేటీఆర్‌ను కోరారు. రోడ్‌షోలో గుత్తా అమిత్‌రెడ్డి, టీవీఎన్.రెడ్డి, నేనావత్ కిషన్‌నాయక్, హనుమంతు వెంకటేశ్‌గౌడ్, వడ్త్య రమేశ్‌నాయక్, మారుపాకుల సురేష్‌గౌడ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి, నక్క గిరిధర్, ముత్యాల సర్వయ్య, కంకణాల ప్రవీణ వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, సుభాష్‌గౌడ్, బీల్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, సుభాష్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.