మునుగోడు బీజేపీ అభ్యర్థిపై భూకబ్జా ఆరోపణలు | Sakshi
Sakshi News home page

మునుగోడు బీజేపీ అభ్యర్థిపై భూకబ్జా ఆరోపణలు

Published Tue, Nov 14 2023 1:52 AM

-

విలేకరులకు వెల్లడించిన బాధితులు

మునుగోడు: మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి తమ వారసత్వపు భూమి కబ్జా చేశాడని హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం తారామతిపేట గ్రామానికి చెందిన భూలక్ష్మితో పాటు ఆమె సోదరి, సోదరుడు సోమవారం మునుగోడులో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. తారమతిపేటలో తమకు వారసత్వంగా సంక్రమిస్తున్న ఇనామ్‌ భూమి 200 ఎకరాలను 20 ఏళ్ల క్రితం చలమల్ల కృష్ణారెడ్డి కబ్జా చేశాడని ఆరోపించారు. ఆ భూమిని తిరిగి పొందేందుకు తాము కోర్టుకు వెళ్తే ఇటీవల కోర్టు అతడిపై సీబీఐ విచారణ జరపాలని ఆదేశించినదని, దాని నుంచి తప్పించుకునేందుకే ఆయన బీజేపీలో చేరాడని అన్నారు. చలమల్ల కృష్ణారెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, అతడి నుండి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని దుర్మరణం

సూర్యాపేట రూరల్‌: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన గుండ్లపల్లి సామేల్‌(69) సోమవారం పిన్నాయిపాలెం నుంచి చీకటిగూడెం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తునప్నాడు. ఈ క్రమంలో టేకుమట్ల గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి దాటుతుండగా సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయపడిన సామేల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుమారుడు వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తెలుగు వెలుగు జాతీయ పురస్కారానికి ఎంపిక

మునగాల: మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మథర్‌ థెరిస్సా యువజన సంఘం వ్యవస్థాపకుడు షేక్‌ జానీ, సభ్యులు వి. లోకేష్‌, కీత వీరబాబు, ఎం. ఫణీందర్‌ తెలుగు వెలుగు జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు వారు సోమవారం తెలిపారు. తమ సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు. ఈ ప్రదానోత్సవంలో తెలుగు వెలుగు వేదిక జాతీయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ పోలోజు రాజ్‌కుమార్‌, జాతీయ కన్వీనర్లు రాగిశెట్టి బ్రహ్మ, వలబోజు మోహన్‌రావు పాల్గొన్నట్లు తెలిపారు. వారు పురస్కారానికి ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement