
రోదిస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు
భూదాన్‌పోచంపల్లి: కముజు పిట్టల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగిలి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన భూదాన్‌పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లిలో చోటుచేసుకుంది. జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన కప్పెర వెంకటయ్య(45) పాత ఇనుప సామగ్రి బేరంతో పాటు, కంజులను పట్టుకొని వచ్చి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. అందులో భాగంగా ఈ నెల 13న ఉద యం కముజు పిట్టల వేట కోసమని ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. దోతిగూడెం శివారులో గ్రామానికి చెందిన పోశమోని శ్రీశైలం అడవి పందుల బెడద నుంచి రక్షణ పొందటానికి వరిపొలం, కూరగాయల తోటకు చుట్టూ కంచే ఏర్పాటు చేసి వైరుకు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. చీకట్లో గమనించని వెంకటయ్యకు కరెంట్‌తీగ తలిగి షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. భర్త వెంకటయ్య మధ్యాహ్నమైన ఇంటికి రాకపోయేసరికి భార్య నర్సమ్మ ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
వెతుకుతున్న క్రమంలో మరో నలుగురికి షాక్
కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం దోతిగూడెం శివారులో వెతుకుతుండగా శ్రీశైలం పొలం సమీపంలో వెంకటయ్య బైక్ కన్పించింది. దాంతో ఇక్కడే ఉండవచ్చునని కొండపల్లి శ్రీను, కప్పెర శ్రీనుతో పాటు మరో ఇద్దరు వెతుకుతున్న క్రమంలో వీరికి సైతం కరెంట్ తీగ తగలడంతో షాక్‌కు గురయ్యారు. గ్రామస్తులు రైతుకు సమాచారం ఇవ్వడంతో వచ్చి కరెంట్ కనెక్షన్ తొలగించి అక్కడ నుంచి పారిపోయాడు. అనంతరం అటుగా వెళ్లి చూడగా వెంకటయ్య విగతజీవుడిగా కనిపించాడు.
మృతుడి కుటుంబానికి
రూ.20లక్షల పరిహారం
విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. రైతు నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం బలైందని రోదిస్తూ ఆందోళన చేపట్టారు. దాంతో ఇరువర్గాలకు చెందిన పెద్ద మనుషులు కూర్చొని మృతుడి కుటుంబానికి రూ.20లక్షల పరి హారం చెల్లించే విధంగా అంగీకారం తెలిపారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ రూరల్ సీఐ మహేశ్, ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

వెంకటయ్య (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment