26న నల్లమలలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన | - | Sakshi
Sakshi News home page

26న నల్లమలలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Nov 19 2026 3:25 AM | Updated on Nov 19 2026 3:25 AM

అచ్చంపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 26న నల్లమల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పదర మండలంలోని మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని.. అనంతరం సంత్‌ శ్రీసేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు అచ్చంపేటలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు.

పదోన్నతితో

మరింత బాధ్యత

కందనూలు: పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుదని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. జిల్లాలోని లింగాల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌కే బహదూర్‌ ఇటీవల హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు హెడ్‌కానిస్టేబుల్‌ హోదాకు సంబంధించిన పట్టీలను ఎస్పీ అలంకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదోన్నతి అనేది కేవలం ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా, బాధ్యతలను మరింత పెంచుతుందన్నారు. పదోన్నతి పొందిన ప్రతి పోలీస్‌ సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీసుశాఖలో క్రమశిక్షణ, నిజాయతీ, సేవాభావం వంటి విలువలను పాటిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పొందాలని తెలిపారు.

సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

లింగాల: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తోందని అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రా అన్నారు. మండలంలోని అంబట్‌పల్లి, మాడాపూర్‌ రెవెన్యూ గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వేను ఆమె బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సర్వేలో హద్దులను ఎలా నిర్ణయిస్తున్నారు.. శాటిలైట్‌ మ్యాప్‌, క్షేత్రస్థాయి కొలతలకు పొంతన ఎలా కుదురుస్తున్నారనే విషయాలపై సర్వే బృందంతో ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎన్ని సర్వే నంబర్లలో, ఎంత విస్తీర్ణంలో సర్వే పూర్తయిందనే వివరాలను తెలుసుకున్నారు. కాగా, పలువురు రైతులు తమ భూములకు సంబంధించిన సందేహాలను సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆమె సర్వే బృందాలను ఆదేశించారు. తహసీల్దార్‌ వెంకటేశ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణాజీ, మండల సర్వేయర్‌ రాంబాబు, ఏఆర్‌ఐ అనిల్‌ పాల్గొన్నారు.

నూతన విద్యావిధానం అమలు సరికాదు

కందనూలు: విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా.. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం సాధ్యమయ్యే అంశం కాదని వక్తలు పేర్కొన్నారు. ఇంటర్‌ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం అంశంపై బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యాపాలసీ అమలుకు ముందు విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని సూచించారు. దశాబ్దాలుగా పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించకుండా ఆగమేఘాల మీద నూతన విద్యావిధానాన్ని తీసుకురావడాన్ని స్వాగతించదగ్గ విషయం కాదని వారు అభిప్రాయపడ్డారు సమావేశంలో వక్తలు శ్రీనివాసులు, కరుణాకర్‌రెడ్డి, పర్వతాలు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement