అమ్రాబాద్: నల్లమలలోని చెంచు కుటుంబాలకు స్థానికంగా ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలని గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ శేషుకుమార్ అన్నారు. గురువారం పదరలో చేపడుతున్న వీబీజీ రాంజీ పథకం ఉపాధి పనులను ఆయన పరిశీలించి చెంచు కూలీలతో మాట్లాడారు. అనంతరం అమ్రాబాద్ మహిళా సమాఖ్య కార్యాలయంలో తెలంగాణ సమ్మిళిత జీవనోపాదుల అభివృద్ధి కార్యక్రమం శిక్షకులతో మాట్లాడి చెంచు కుటుంబాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా గ్రామాల్లో చాలా వరకు పనులు తగ్గాయని వివరించారు. ఇందుకోసం గ్రామాల్లో వీబీజీ రాంజీ ఉపాధి పథకం ద్వారా చేపడుతున్న పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి చెంచు కుటుంబంలోని వారికి ఏమేమి అవసరాలు ఉన్నయో గుర్తించి సమస్య పరిష్కరించాలని చెప్పారు. జాబ్‌కార్డులు లేని వారికి వెంటనే ఇప్పించాలని ఆదేశించారు. ఆయన వెంట టీజీఎల్పీ కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఎంపీడీఓలు రామన్న, సుధాకరాచారి, ఏపీఓలు, ఈసీలు తదితరులున్నారు.


