లింగాల: భూముల రీ సర్వే పనులను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. మండలంలోని అంబట్‌పల్లి, మాడాపూర్ గ్రామాల్లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న భూముల రీ సర్వే పనులను ఆయన గురువారం పరిశీలించి.. సర్వేయర్లుకు సూచనలు చేశారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఉన్న ప్రతి సర్వే నంబర్‌ను సర్వే జరిపించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే అనేది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సర్వేకు పూర్తి సహకారం అందించాలని ఆయన రైతులను కోరారు. ఈ సర్వే ఆధారంగా ప్రభుత్వ భూములు, పట్టా భూములు, గ్రామ శివారు ప్రాంతం ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణాజీ, ఆర్‌ఐ అనిల్, సర్వేయర్ రాంబాబు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.


