నాగర్‌కర్నూల్/ కందనూలు: జిల్లాలో కంకర, ఇసుక లభ్యతను పెంపొందించడంతోపాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి ప్రీ యాక్షన్ కమిటీ, ఇసుక కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో కంకర తవ్వకాలకు గుర్తించిన ప్రాంతాలు, నూతనంగా గుర్తించిన ఇసుక రీచ్‌లు, వాటికి మంజూరు అనుమతులు, ఇసుక సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ చెన్నయ్య, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రాతో కలిసి సమీక్షించారు. తెలకపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో కంకర తవ్వకాల కోసం గుర్తించిన రెండు గ్రామాల్లో సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. కంకర తవ్వకాలకు అనువైన పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనలు, అవసరమైన అనుమతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే వంగూరు మండలం జాజాల గ్రామ పరిధిలో నూతనంగా గుర్తించిన ఇసుక రీచ్‌లకు అవసరమైన అనుమతులు మంజూరు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జాజాల ఇసుక రీచ్‌ల నుంచి జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇసుక రీచ్‌ల అనుమతులు, కంకర తవ్వకాల ఏర్పాట్లు, ఇసుక సరఫరా విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో మైనింగ్ ఏడీ హరికృష్ణ, హౌసింగ్ పీడీ గోపాల్‌నాయక్, భూగర్భ జల అధికారి దివ్య జ్యోతి, ఆర్డీఓలు అర్చన, బన్సీలాల్, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు వ్యక్తిగత అభిప్రాయాలు, ఒత్తిళ్లకు తావులేకుండా.. అర్హత, నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని, ప్రతినెలా రెవెన్యూ అంశాల పురోగతిపై ప్రత్యక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతికి సంబంధించి ప్రజల నుంచి అందిన భూ రికార్డులు, యాజమాన్య హక్కులు, భూముల వివరాల్లో మార్పులు, చేర్పులు, ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు.


