జిల్లాలో 90.91 శాతం పూర్తయిన డిజిటల్ క్రాప్ సర్వే
చారకొండ టాప్..
● అత్యధికంగా చారకొండలో వంద.. అత్యల్పంగా పదరలో 47 శాతం నమోదు
● ప్రత్యేకంగా వలంటీర్లకు శిక్షణ
ఇచ్చి వివరాల నమోదు
● లక్ష్యం చేరికపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి
● మరో పదిరోజుల్లో పూర్తిచేసేలా కసరత్తు
నాగర్‌కర్నూల్: వ్యవసాయ భూములు.. సాగులో ఉన్న పంటల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసే క్రాప్ సర్వేలో జిల్లా 90.91 శాతం పురోగతి సాధించింది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 8,60,938 ప్లాట్లను (సబ్ నంబర్లు) సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 7,82,640 ప్లాట్ల వివరాలను నమోదు చేశారు. ఇంకా 78,298 ప్లాట్ల సర్వే మిగిలి ఉంది. జిల్లా సగటు పురోగతి ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. మండలాల వారీగా పరిశీలిస్తే పనుల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కొన్ని మండలాలు లక్ష్యానికి చేరువవుతుండగా.. మరికొన్ని మండలాలు వెనకబడటం స్పష్టంగా కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం పంటల కాకి లెక్కలకు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌ను ఈ ఏడాది ప్రారంభించింది తెలిసిందే. దీని వల్ల పంటల లెక్క పక్కాగా తేలుతుంది. అంతేకాకుండా పంటల వివరాలతోపాటు రైతు పేరు, ఎక్కడ ఏ సర్వే నంబరులో ఏ పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో తెలుస్తుంది. జిల్లాలో ఆగస్టు నెలలో ఈ సర్వే ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక వలంటీర్లను నియమించి శిక్షణ ఇవ్వగా.. గ్రామాల్లో యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో చారకొండ మండలం వందశాతం పూర్తి చేసి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. పెంట్లవెల్లి 98.86 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. తిమ్మాజిపేట 97.79, బిజినేపల్లి 96.81, తెలకపల్లి 96.31, కల్వకుర్తి 96.24 శాతం పురోగతి సాధించాయి. ఈ మండలాలు సర్వే లక్ష్యానికి దగ్గరలో ఉన్నాయి. కోడేరు, ఉప్పునుంతల, ఊర్కొండ, నాగర్‌కర్నూల్, వంగూరు మండలాల్లోనూ 93 శాతానికి పైగా సర్వే పూర్తయింది. మిగిలిన కొద్దిపాటి పనులను వేగవంతం చేస్తే ఈ మండలాలు కూడా వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.


