నాగర్‌కర్నూల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని.. తమలోని ప్రతిభను వెలికితీసి ఉన్నతస్థాయికి ఎదగాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. జిల్లాలోని 24 పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన బాలబాలికలకు జిల్లాకేంద్రంలోని బాలుర జెడ్పీహెచ్‌ఎస్ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు కబడ్డీ, వాలీబాల్‌తోపాటు 100 మీ., 200 మీ., 400 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, త్రోబాల్ తదితర క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించే అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్‌లో మరింత కృషి చేసి ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులను డీఈఓ అభినందించి, విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, వెంకటయ్య, పాండు, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


