బల్మూర్: ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ సదుపాయం కల్పించి కొండారెడ్డిపల్లిని వందశాతం సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు. సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ.. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కొండారెడ్డిపల్లిలో చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. మండలంలోని కొండారెడ్డిపల్లిలో బుధవారం అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రాతో కలిసి కలెక్టర్ పర్యటించారు. తెలంగాణ రెడ్కో భాగస్వామ్యంతో గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను పరిశీలించి, పనుల పురోగతిపై ఆరా తీశారు. ఇప్పటివరకు 101 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులు ఎల్లమ్మ, పార్వతమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అందిన బిల్లులు, పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు రూ.3.40 లక్షల మేర బిల్లులు అందాయని, మరో బిల్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. అలాగే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కేంద్రం నిర్వహణ, పిల్లల సంరక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు మెరుగైన వాతావరణం కల్పించి, వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన పనులను, పోలేపల్లిలో భూ రీ సర్వే పనులను పరిశీలించారు. అంతకు ముందు కొండారెడ్డిపల్లిలోని ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రేవత్‌రెడ్డి, వ్యవసాయాధికారి నరేష్, పశువైద్యాధికారులు అనఅల్, మహేశ్వరి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, పీఆర్‌ఏఈ శ్రీనివాస్, టీజీ రెడ్కో అధికారులు, సర్పంచ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్


