కొల్లాపూర్: పుస్తక పఠనంతోనే విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు జ్ఞాపకశక్తి పెంపొందుతుందని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కొల్లాపూర్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయానికి రూ. 40వేల విలువైన రోటీ మేకింగ్ మిషన్, రూ. 10వేల విలువైన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. భాషా నైపుణ్యాలు, ఆలోచనా విధానం, ఊహాశక్తి, సృజనాత్మకత వంటి అంశాలు పుస్తక పఠనం ద్వారా నేర్చుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యపుస్తకాలను ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. కేజీబీవీల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్జేడీని స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఇమ్మానుయేల్, మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్ పాషా, పెబ్బేటి శేఖర్, కేజీబీవీ ప్రత్యేకాధికారి నారాయణమ్మ పాల్గొన్నారు.
ఆగని పోరాటం
చారకొండ: గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు తేల్చిచెప్పారు. తమ గ్రామాలను ముంపు ముప్పు నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 303వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్య సీఎం దృష్టికి చేరి, న్యాయం జరిగే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నిర్వాసితులు బాలయ్య, గోపాల్, ప్రకాశ్, శ్రీరామ్ పాల్గొన్నారు.
రేపు ఫుట్‌బాల్
క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల, మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ జట్ల ఎంపికలను ఈనెల 2వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తునట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్, కాన్సెంట్ ఫామ్, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలని కోరారు. మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలని సూచించారు. వివరాల కోసం 9396439663 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
కరువు జిల్లాగా
ప్రకటించాలి
తాడూరు: తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగుచేసిన పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయని.. నాగర్‌కర్నూల్‌ను కరువు జిల్లాగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు. బుధవారం తాడూరు, ఏటిదారిపల్లి, గోవిందాయపల్లి గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి వర్షాలు లేకపోవడం, కరెంటు కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎకరాకు రూ.50వేల పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు మశన్న, వెంకటయ్య, అనిల్‌కుమార్, ఆంజనేయులు, బాలమణి, శ్రీలత పాల్గొన్నారు.


