● నల్లమల అటవీ గ్రామాల
పునరావాసంతో సురక్షిత నివాస వసతి
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని.. అందులో భాగంగా వారికి సురక్షితమైన నివాస వసతి కల్పించేందుకు పునరావాస ప్రక్రియ చేపట్టిందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ కోర్ ఏరియాలోని సార్లపల్లి, కుడిచింతలపల్లి, తాటిగుండాల, కొల్లంపెంట గ్రామాలకు చెందిన 36 మంది పునరావాస లబ్ధిదారులకు బుధవారం కలెక్టరేట్‌లో డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్రతో కలిసి ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెదకొత్తపల్లి మండలం బాచారం సమీపంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో 250 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. పునరావాస ప్రక్రియలో భాగంగా మొత్తం 417 కుటుంబాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీని అందుకుంటున్నారన్నారు. వీరిలో 257 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగా.. మిగిలిన 160 కుటుంబాలు రూ. 15లక్షల పునరావాస ప్యాకేజీ తీసుకున్నారని పేర్కొన్నారు. పునరావాస కేంద్రంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తెలిపారు.
పారదర్శకంగా భూముల రీ సర్వే..
కందనూలు: జిల్లాలో భూముల రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో చేపట్టిన రీ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి రీ సర్వే ప్రక్రియపై ఆరా తీశారు. ప్రభుత్వం చేపడుతున్న భూముల రీ సర్వేతో కలిగే ప్రయోజనాలను వివరించారు. భూములకు స్పష్టమైన హద్దులు ఏర్పడటంతో పాటు భవిష్యత్‌లో భూ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖానాపూర్ గ్రామ పరిధిలో మొత్తం 2,525.15 ఎకరాల భూములను రీ సర్వే ప్రక్రియలోకి తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులకు ఏమైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం గ్రామంలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, మౌలిక వసతులు అవసరమని హెచ్‌ఎం రాజారెడ్డి కలెక్టర్‌కు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ మునీరుద్దీన్, సర్పంచ్ ఇందిరా ఉన్నారు.


