గిరిజనుల సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దు

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

కందనూలు/కొల్లాపూర్‌/కోడేరు: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ నాయక్‌ అన్నారు. బుధవారం కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని ముక్కిడిగుండం, జీల్దార్‌తిప్ప, తెల్లరాళ్లపల్లి తండా, ఠాగూర్‌ తండా, ఎత్తంగట్టు, జొన్నలబొగుడ తండాల్లో ఆయన గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి.. వారి సమస్యలతో పాటు పోడు భూముల సాగు విస్తీర్ణం, సాగునీటి వనరులను తెలుసుకున్నారు. అనంతరం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి గిరిజనుల సమస్యలపై పలు శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా హుస్సేన్‌ నాయక్‌ మాట్లాడుతూ.. గిరిజనుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల అధికారులు పనిచేయాలన్నారు. గిరిజనులకు ఏ సమస్య వచ్చినా జాతీయ గిరిజన పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే యుద్దప్రాతిపదికన పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. జిల్లాలోని గిరిజన తండాల్లో అవసరమైన వసతులను కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. ఎత్తంగట్టు దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలోని రోడ్డు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తండాల్లో గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా పోడు భూములను సాగుచేస్తున్న గిరిజన రైతులను ఇబ్బందులు పెట్టొద్దని ఫారెస్ట్‌ రేంజర్‌ వాణికుమారికి సూచించారు. అటవీ ప్రాంతంలోని మునీశ్వరుడిని పూజించేందుకు గిరిజనులకు అన్ని వసతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. జీల్దార్‌తిప్ప చెరువుకు కేఎల్‌ఐ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, గిరిజన సంఘాల నాయకులు ఎస్టీ కమిషన్‌ సభ్యుడికి వివిధ అంశాలపై వినతిపత్రాలను సమర్పించగా.. సానుకూలంగా స్పందించారు. ప్రజలు జాతీయ ఎస్టీ, ఎస్సీ, బీసీ కమిషన్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఎత్తంగట్టు వద్ద సేవాలాల్‌ ఆలయ నిర్మాణానికి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఇటీవల ఎస్‌ఐ అకారణంగా దాడి చేయడంతో గాయపడిన పరమేశ్‌ను ఆయన పరామర్శించారు. అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్రా, డీఎఫ్‌ఓ రేవంత్‌ చంద్ర, డీఆర్వో పాండు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటయ్య, ఆర్డీఓ భన్సీలాల్‌, తహసీల్దార్లు మాధవి, జమీల్‌, నాయకులు దిలీప్‌ ఆచారి, కోటాజీ, లింగన్‌గౌడ్‌, ఎల్లయ్య, అశోక్‌, తిరుపతి నాయక్‌, హనుమంత్‌ నాయక్‌, సర్పంచ్‌ లాలీబాయ్‌, ఉపసర్పంచ్‌ శేఖర్‌, మల్లేష్‌ యాదవ్‌ మాజీ సర్పంచ్‌ ఆర్యా బోజ్యానాయక్‌ పాల్గొన్నారు.

పోడు రైతులను ఇబ్బందులకు

గురిచేయొద్దు

తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి

జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement