దోస్త్‌.. లాస్ట్‌ చాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

దోస్త్‌.. లాస్ట్‌ చాన్స్‌

Sep 25 2026 1:11 AM | Updated on Sep 25 2026 1:11 AM

కల్వకుర్తి టౌన్‌: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్‌ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరేందుకు మరో అవకాశం కల్పించింది. 2026– 27 విద్యా సంవత్సరానికి గాను శుక్ర, శనివారాల్లో ప్రత్యేక స్పాట్‌ అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్‌ జారీచేసింది. దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకోని వారు వెంటనే స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా కోర్సులలో చేరాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలు స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నోటీస్‌ బోర్డులలో ఉంచగా.. ఏయే కోర్సులలో ఖాళీలు ఉన్నాయో పొందుపరిచారు. ఆన్‌లైన్‌ సౌకర్యార్థం దోస్త్‌ పోర్టల్‌లో కూడా ఖాళీల వివరాలను పొందుపరిచారు.

నమోదు చేసిన కళాశాలల్లో..

దోస్త్‌ చివరి అవకాశంలో భాగంగా అడ్మిషన్‌ తీసుకునే విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్త్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో కట్టిన రుసుంతో వచ్చిన రశీదును వారు ఎంచుకున్న కళాశాలలో చూయించాల్సి ఉంటుంది. స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా భర్తీ కానీ సీట్లకు శుక్రవారం వన్‌టైం స్పాట్‌ అడ్మిషన్‌ రౌండ్‌లో అడ్మిషన్‌ పొందవచ్చు. నాన్‌ లోకల్‌ విద్యార్థులకు అవకాశం కల్పించారు. అయితే ఇది వరకే కళాశాలలో అడ్మిషన్‌ పొ ందిన విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

జిల్లాలో 2,420 మిగులు సీట్లు

జిల్లాలో పీయూ పరిధిలో నాలుగు గవర్నమెంట్‌, ఏడు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా.. వాటిలో 3,654 సీట్లకు గాను 2,405 సీట్లు స్పాట్‌ అడ్మిషన్‌లో భాగంగా విద్యార్థులకు ఎంచుకునే అవకాశం ఉంది. దోస్త్‌ అన్ని విడతలలో కలిపి 1,279 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆయా కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు గాను లెక్చరర్లు ఎంతో శ్రమించినా.. ఆశించినంతగా అడ్మిషన్లు రాలేదు.

డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు స్పాట్‌ అడ్మిషన్‌ పక్రియ

నేడు ప్రత్యేక చివరి విడతప్రవేశాల చేరిక

విద్యార్థులకు ప్రభుత్వం చివరి అవకాశం

సర్టిఫికెట్లు తీసుకురావాలి

స్పాట్‌ అడ్మిషన్‌లో భాగంగా అడ్మిషన్‌ పొందాలనుకునే విద్యార్థులు వారి వెంట ఎస్సెస్సీ మెమో, ఇంటర్‌, టీసీ, ఒకటి నుంచి ఇంటర్‌ వరకు బోనోఫైడ్‌ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, రెసిడెన్సీ, ఏదైనా బ్రిడ్జి కోర్సు చదివి ఉంటే.. దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఫారాలతో పాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు వెంట తీసుకెళ్లాలి. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్‌, మెరిట్‌ ఆధారంగా వివిధ కోర్సులలో సీట్లు భర్తీ చేస్తారు. స్పాట్‌ అడ్మిషన్లలో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు. విద్యార్థులే ఆయా కళాశాలలో ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement