కందనూలు: హన్మకొండ వేదికగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఏఐఎస్‌ఎఫ్ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ప్రేమ్‌కుమార్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వార్షికోత్సవాల వాల్‌పోస్టర్లను విడుదల చేసి ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫిరాయింపుదారులకు కనువిప్పు : బీజేపీ
కందనూలు: ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మరో పార్టీలోకి ఫిరాయించే ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలిగేలా హైకోర్టును సమర్థిస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ తీర్పును గౌరవించి పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని చెప్పారు. ఈ తీర్పుతో ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని ప్రజలకు నమ్మకం కలిగేలా భరోసా ఉందన్నారు. ఇప్పటికై నా పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలవాలని డిమాండ్ చేశారు.
నేడు సామాజిక సదస్సు
తిమ్మాజిపేట: కుల నిర్మూలన, సామాజిక న్యాయంపై మేధావుల అభిప్రాయ సేకరణపై శుక్రవారం జిల్లాకేంద్రంలో సామాజిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర టెలికాం డైరెక్టర్ శ్రీనివాస్ బహదూర్ అన్నారు. గురువారం ఆయన తిమ్మాజిపేటలో బీసీ నాయకుడు అశోక్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన విధానంపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించే సామాజిక సదస్సుకు ప్రతినిధులు, మేధావులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కుల వివక్ష, అసమానతలు ఇంకా కొనసాగడం దారుణమన్నారు. సామాజిక న్యాయం అందరికీ దక్కాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాలలో అన్ని వర్గాలకు సమాన వాటా దక్కేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు.


