నాగర్‌కర్నూల్/తిమ్మాజిపేట: జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల సమగ్ర కార్యాచరణ రూపొందించి.. పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు, జ్ఞాన భారతం మిషన్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు సహజ, చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. నల్లమల అటవీ ప్రాంతం, ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా గుర్తించి.. వాటి ప్రాధాన్యత ఆధారంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను నిర్దేశిస్తామన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చేలా ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. జ్ఞాన భారతం మిషన్‌లో భాగంగా జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాచీన గ్రంథాలను సంరక్షించడంతో పాటు డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా వాటిని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండటంతో పాటు చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన పండితులు, భాషా నిపుణుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, డీపీఓ శ్రీరాములు, డీవైఎస్‌ఓ సీతారాం పాల్గొన్నారు.
● తిమ్మాజిపేట మండలంలోని ఇండియన్ మేడ్ లిక్కర్ డిపోను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపోలో మద్యం నిల్వలు, సరఫరా విధానం, భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏయే ప్రాంతాల నుంచి డిపోకు మద్యం సరఫరా అవుతోంది.. ఇక్కడి నుంచి ఏయే జిల్లాలు, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే వివరాలను అధికారులతో తెలుసుకున్నారు. మద్యం సరఫరా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా నకిలీ మద్యం సరఫరాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. డిపోలో మద్యం నిల్వలు భద్రంగా ఉండేలా అవసరమైన భద్రతా ప్రమాణాలను పాటించాలని.. అగ్నిప్రమాదాలు తదితర ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాగా, డిపోలో 75వేల బీరు కాటన్లు, 62వేల లిక్కర్ కాటన్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి, డిపో మేనేజర్ మల్లికార్జున్, స్టోర్ ఆఫీసర్ మధు, తహసీల్దార్ జయంతి ఉన్నారు.


