కందనూలు: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందక మధ్యలోనే చదువు మానేసి ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన విద్యార్థి యువజన నిరుద్యోగ పోరుబాట ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. చదువుకున్న వ్యక్తి వద్ద విద్యాశాఖ ఉంటే ఆ శాఖకు, ఆ వ్యవస్థకు న్యాయం జరిగేదన్నారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. ముగ్గురికి కూడా స్కూటీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో గురుకులాలను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్ది.. పేదల జీవితాల్లో విద్యాజ్యోతిని వెలిగించారని గుర్తుచేశారు.
● విద్యార్థి యువజన పోరుబాట ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి డీఎస్పీపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్నా కార్యక్రమానికి విద్యార్థులు రాకుండా డీఎస్పీ ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఫోన్‌చేసి అడ్డుకున్నారని ఆరోపించారు. డీఎస్పీ తన పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకు పీఏగా ఉండి, ఇంటి పనులు చేసుకో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు పాల్గొన్నారు.


