కందనూలు: ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సంరక్షణ, విద్య, ప్రభుత్వాలు అందించే సదుపాయాలు, వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో వివిధ రకాల వైకల్యాలు కలిగిన 2,514 మంది పిల్లలకు విద్య అందించేందుకు 20మంది ఐఆర్పీలు, 55 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు సేవలు అందిస్తున్నారని డీఈఓ వివరించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్ ప్రాథమిక పాఠశాల, ఉయ్యాలవాడలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో ఏఎంఓ కిరణ్ కుమార్, ఏఎస్‌ఓ మాధవరెడ్డి, డీఎస్‌ఓ శైలజ, జీసీడీఓ నిర్మల, ఎంఈఓ కుర్మయ్య పాల్గొన్నారు.


