కల్వకుర్తి రూరల్: కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల, ఎలికట్ట గ్రామాల రైతులు బుధవారం స్థానిక ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ 8 గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని.. బోరుమోటార్ల కింద సాగుచేస్తున్న కొద్దిపాటి పంటలు కూడా విద్యుత్ కోతలతో ఎండిపోతున్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ కోతలను నియంత్రించి, సాగుచేసిన పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏడీఈ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.


