కందనూలు: సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటీల్ అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతోనే ఉపాధ్యాయుల బాధ్యత ముగిసి పోదని, వారి వ్యక్తిత్వ వికాసానికి మార్గనిర్ధేశం చేసి, జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంటుందన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 70 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్, సెక్టోరియల్ అధికారులు కిరణ్‌కుమార్, నూరుద్దీన్, కురుమయ్య, రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.


