● 9,76,987 ఓటర్లకు గాను 8,35,408 మంది వివరాల నమోదు
● 85.51శాతం పూర్తి
● ముసాయిదా జాబితా రూపకల్పనకు కసరత్తు
జిల్లాలో ముగిసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్
పకడ్బందీగా ప్రక్రియ..
సర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ప్రస్తుతం ఓటరు జాబితాలో మరణించిన వారి సంఖ్య తేలింది. అదే విధంగా అనామలీస్‌గా తేలిన ఓటర్లు తొలిగించినట్లు కాదు. ఒకే ఓటరు రెండు చోట్ల నమోదు కావడం.. పేరు, వయసు, చిరునామాలో తేడాలు, ఫొటో వివరాలు సరిపోకపోవడం, డూప్లికేట్ ఓటరు నమోదు ఇతరత్రా వాటికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తాం. అలాంటి వారు ముందుకొచ్చి ఆధారాలు చూపితే మళ్లీ ఓటరు జాబితాలో చేర్చుతాం. – చెన్నయ్య, అదనపు కలెక్టర్
నాగర్‌కర్నూల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. జిల్లావ్యాప్తంగా 9,76,987 మంది ఓటర్లు ఉండగా.. పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. 45 రోజులపాటు సాగిన ఈ ప్రక్రియలో ఓటర్లు తమ పూర్తి వివరాలతో తిరిగి ఇచ్చిన 8,35,408 ఫారాలను డిజటలైజేషన్ చేశారు. మొత్తం 85.51 శాతం నమోదైంది. ఇక 1,41,579 మంది ఓటర్ల లెక్క తేలలేదు. ఈ ఓటర్ల వివరాలు వివిధ రకాల కారణాలతో అన్‌కలెక్టబుల్‌గా మిగిలాయి. వీటిలో మృతులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డబుల్ ఓట్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటికిప్పుడు తుది జాబితా నుంచి తొలగించినట్లు కాదు. ఈనెల 17న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో వీటి వివరాలు వెల్లడికానున్నాయి.


