తిమ్మాజిపేట: రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణను అనుబంధ రంగంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం తిమ్మాజిపేట మండలం మరికల్ సమీపంలో పశుపోషణ చేపట్టిన రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల వద్ద ఎన్ని పశువులు ఉన్నాయి.. గ్రామంలో పాడి ఉత్పత్తి.. రైతుల నెలవారీ ఆదాయం తదితర వివరాలను తెలుసుకున్నారు. పశుసంపదను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. పాడి ఉత్పత్తిని పెంచుతున్న రైతులకు అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు తిమ్మాజిపేటలో పశువైద్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యశాలలో పశువులకు అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న మందులపై ఆయన ఆరా తీశారు. పశుసంపద పరిరక్షణతో పాటు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో పశువుల సంఖ్య, యజమానుల ఆధార్ వివరాలను ఎంత వరకు ఆన్‌లైన్ చేశారనే వివరాలను తెలుసుకున్నారు.
● అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తిమ్మాజిపేటలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలో నమోదైన చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. పిల్లలు వయసుకు అనుగుణంగా వారి ఎత్తు, బరువు ఉన్నారా అని పరిశీలించారు. బలహీనంగా ఉన్న పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారంతో పాటు ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను విధిగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. అదే విధంగా ఆవంచలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన బాలికలు, గర్భిణులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి డీఆర్వో పాండు, తహసీల్దార్ జయంతి, సర్పంచులు కవితా భక్తవత్సలం, రమాదేవి, చంద్రకళా కృష్ణకుమార్ ఉన్నారు.


