సర్కారు బడుల్లో ‘లిప్‌’ | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో ‘లిప్‌’

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంగ్లంలోనే కాకుండా మాతృభాష తెలుగులోనూ తడబడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో గణితంలోనూ పిల్లలు వెనకబడుతున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విద్య బలోపేతం కోసం విద్యాశాఖ ఉన్నత పాఠశాలల్లో లిప్‌ (లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం) కార్యక్రమం అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల పిల్లలకు ఈ విద్యాసంవత్సరం నుంచి అభ్యసన నైపుణ్యాలు పెంపొందించడం కోసం అమలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే జిల్లాలో ఉపాధ్యాయ నిపుణులతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నమూనా పరీక్షల్లో తడబాటు

అభ్యసన సామర్థ్యాల్లో పిల్లలు తడబడుతున్నారు. తరగతికి తగినట్లుగా నేర్చకోవడం లేదని స్పష్టమైంది. తెలుగు, ఆంగ్లంతోపాటు కూడికలు, తీసివేతలు కూడా చేయడం లేదని తేలింది. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 7 నుంచి 11 వరకు బేస్‌లైన్‌ పరీక్షలు ఆఫ్‌లైన్‌ మోడ్‌లో నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసి లోపాలను గుర్తిస్తారు. తర్వాత ప్రత్యేక విద్యాబోధన ద్వారా మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటారు. బేస్‌లైన్‌, ఎండ్‌లైన్‌ పరీక్షల ఫలితాలను పోల్చి విద్యార్థుల పురోగతిని విశ్లేషిస్తారు. దీని ఆధారంగా వెనకబడిన విద్యార్థులకు విద్యాసాయం అందిస్తారు. ఈ ఫలితాలను తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో ఈ నెల 31లోగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను అప్‌లోడ్‌ చేయడంపై తెలంగాణ ఎస్‌సీఈఆర్టీ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.

విద్యార్థులకు వర్క్‌బుక్స్‌..

లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (లిప్‌)లో భాగంగా 6, 7, 8, 9వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల వర్క్‌బుక్స్‌ అందజేస్తారు. ప్రతిరోజు ప్రత్యేకంగా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా మల్టీలెవల్‌ విద్యాబోధన చేస్తారు. నిరంతర మూల్యంకనం ఉంటుంది. చదువు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక రీడింగ్‌ సెషన్లు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు కాలానుగుణంగా ప్రణాళికలు, లక్ష్య నిర్ధారణ, విద్యార్థుల పురోగతి సమీక్ష, వర్క్‌బుక్‌ ఆధారిత బోధనపై దృష్టిసారించనున్నారు. లిప్‌పై బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను ఇప్పటికే ఆదేశించారు. ఎస్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది.

అభ్యసన సామర్థ్యాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు

6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్షలు

వెనకబడిన సబ్జెక్టుల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధన

ఉపాధ్యాయులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు

అమలు చేస్తున్నాం..

విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపే లక్ష్యంగా లిప్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులపై పోకస్‌ ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాం. విద్యార్థులు భాషా ప్రావీణ్యం సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలి. ఫలితాలను గడువులోగా తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

– రమేష్‌కుమార్‌, డీఈఓ

నవంబర్‌ 20 నుంచి..

ఈ ఏడాది నవంబర్‌ 20 నుంచి 30 వరకు విద్యార్థులకు మిడ్‌లైడ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబరు 10న ఫలితాలు విడుదల చేస్తారు. ఎండ్‌లైన్‌ పరీక్షలు 2027 మార్చి 7 నుంచి 27 వరకు నిర్వహిస్తారు. మార్చి 31న ఫలితాలు ప్రకటించి ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల పురోగతిని నిరంతరం పరిశీలించి అవసరమైన విద్యాసాయాన్ని అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement