కందనూలు: నేరాల కట్టడిలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకం అని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పోలీసుస్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అన్నారు. నేరాల నియంత్రణ, నేరస్తులను త్వరితగతిన గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమైనదని, పట్టణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మంజూరు చేసిన నిధులతో మెగా కంపెపీ, వ్యాపారులు ఇచ్చిన విరాళాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నిఘా వ్యవస్థను జిల్లావ్యాప్తంగా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా బిజినేపల్లిలో 32, కుమ్మెరలో 6, నాగర్‌కర్నూల్ పట్టణంలో 25, తిమ్మాజిపేటలో 17 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
సీఐ కార్యాలయం తనిఖీ
వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ నాగర్‌కర్నూల్ సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, వారు ఇచ్చే ప్రతి ఫిర్యాదును వేగంగా స్పందించి పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని రౌడీషీటర్ల వివరాలు తెలుసుకుని.. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఎలాంటి కేసులు పెండింగ్‌లో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.


