అందుబాటులో లేని చేయూత పింఛన్ లబ్ధిదారులు
పింఛన్
లబ్ధిదారులు
కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ (లైవ్ ఆథెంటికేషన్) ప్రక్రియ రెండు రోజుల క్రితం పూర్తయింది. బోగస్ పింఛన్ల ఏరివేత, మరణించిన వారిని గుర్తించేందుకు చేపట్టిన ఈ ప్రక్రియలో బయటపడిన వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో లబ్ధిదారుల ఆచూకీ లభించకపోవడం.. మరికొందరు మరణించినా పింఛన్ సొమ్ము పొందుతున్నట్లు తేలింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,02,976 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 58,700 మంది పోస్టాఫీస్, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్ సొమ్ము పొందుతుండగా.. 44,276 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతోంది.
వేల సంఖ్యలో బోగస్..?
జిల్లాలో చేయూత పింఛన్ లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ లెక్కల ప్రకారం 2,373 మంది మరణించినట్లు గుర్తించారు. మరో 1,860 మంది లబ్ధిదారుల ఆచూకీ అధికారులకు లభించలేదు. వారి ఇళ్లకు సిబ్బంది వెళ్లినప్పటికీ అందుబాటులో లేరని తెలిసింది. ఇంతకాలం పింఛన్లు పొందుతున్న వారి ఆచూకీ అధికారులకు సైతం లభించకపోవడం గమనార్హం. మరో 45 మంది లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ పూర్తి కాలేదు. వివిధ కారణాలతో నమోదు కాకపోవడంతో మరోసారి వారిని సంప్రదించి.. ప్రక్రియ పూర్తి చేయనున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మండలాల్లో
మరణించిన వారు 1,690
ఇంకా
లభించని వారు 667
కొత్త అర్హులకు మార్గం..
ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తికావడంతో అనర్హుల పేర్ల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఖాళీ అయ్యే పింఛన్ల స్థానంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న అర్హులైన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు చేయూత పింఛన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో పూర్తయిన లైవ్ అథెంటికేషన్
2,373 మంది మృతిచెందినట్లు గుర్తింపు
మరో 45మంది ప్రత్యక్ష ధ్రువీకరణ కాని వైనం
ఏళ్లుగా డేటా నవీకరణలో జాప్యం
గుర్తింపునకు వస్తే కొనసాగిస్తాం..
జిల్లాలో ఇంకా 1,860 మంది లైవ్ అథెంటికేషన్‌కు సంబంధించి ఆచూకీ లభించడం లేదు. లబ్ధిదారులు సంబంధిత గ్రామం, మున్సిపాలిటీలో అధికారులను సంప్రదిస్తే ప్రత్యక్ష ధ్రువీకరణ పూర్తిచేసి.. చేయూతలో కొనసాగిస్తారు. లేదంటే పింఛన్ నిలిచిపోతుంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించి.. వారి తదు పరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– రాజేశ్వరి, అడిషనల్ డీఆర్డీఓ


