జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామసభల్లో తాగునీటి సమస్యను ప్రజలు ప్రస్తావించే అవకాశం ఉందని, ఇందుకు గాను ముందుగానే అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిపొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. లబ్ధిదారుల జాబితా, నోడల్ అధికారుల జాబితా, దరఖాస్తుల వివరాలను అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఒక్కోరోజు తాను పాల్గొంటానని పేర్కొన్నారు. ఇందులో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయని, 99 రోజుల కార్యక్రమానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. అటవీ పోడు భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల సమావేశాలు నిర్వహించేలా చూస్తామన్నారు.
‘ప్రజాపాలన’ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలి
99 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ


