కందనూలు: పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మొదటి థీమ్ ‘పరిశుభ్రత’ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవరణలో కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి అధికారులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నుంచి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యాలయ పరిసరాలు, గదులు, రికార్డు గదులు పరిశుభ్రంగా ఉంచాలని, అలాగే కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన ఫైళ్లు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ, సమాజ ఆరోగ్య రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు రమేష్‌కుమార్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


