పురవిప్పిన ఓటరు | - | Sakshi
Sakshi News home page

పురవిప్పిన ఓటరు

Feb 12 2026 1:25 PM | Updated on Feb 12 2026 1:25 PM

 పురవిప్పిన ఓటరు

పురవిప్పిన ఓటరు

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 77.64 శాతం ఓటింగ్‌ నమోదు

ఉదయం 7

గంటల నుంచే బారులుదీరిన ఓటర్లు

కల్వకుర్తిలో అత్యధికంగా 80.80, నాగర్‌కర్నూల్‌ లో అత్యల్పంగా

73.98 శాతం పోలింగ్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో పట్టణ ఓటరు పురివిప్పారు. ఎన్నికలు జరిగిన మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇందులో అత్యధికంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో 80.80 శాతం ఓటింగ్‌ జరగగా.. కొల్లాపూర్‌లో 80.10 శాతం, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో అత్యల్పంగా 73.98 శాతం పోలింగ్‌ నమోదైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. ఉదయం నుంచే కేంద్రాలకు ఓటర్ల రాక ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ కాస్త మందకొడిగా కొనసాగగా, ఆ తర్వాత పుంజుకుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65 వార్డులకు సంబంధించి 131 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ జిల్లాకేంద్రంలోని పలు పోలింగ్‌కేంద్రాలను సందర్శించి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు.

జిల్లాకేంద్రంలో తగ్గిన పోలింగ్‌ శాతం..

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ఇక్కడ మొత్తం 35,378 మంది ఓటర్లకు గానూ 26,171 మంది మాత్రమే ఓటు వేశారు. ఉదయం 9 గంటలకల్లా మిగతా మున్సిపాలిటీల కన్నా ఎక్కువగా పోలింగ్‌ జరగ్గా, సాయంత్రానికి ఓటింగ్‌ శాతం తగ్గింది. కల్వకుర్తిలో అత్యధికంగా 80.80 శాతం నమోదైంది. మొత్తం 26,023 మంది ఓటర్లకు గానూ 21,027 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొల్లాపూర్‌లో మొత్తం 19,356 మంది ఓటర్లకు 15,505 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 80.10 శాతం నమోదైంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్‌ ముగిసే 5 గంటల సమయానికి పోలింగ్‌ కేంద్రంలో క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటుహక్కు కల్పించారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లోని పలు వార్డుల్లో సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్‌ కొనసాగింది.

243 మంది అభ్యర్థులు..

పోలింగ్‌ ముగిసిన తర్వాత అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసి ఆయా మున్సిపాలిటీల్లోని స్ట్రాంగ్‌ రూం వద్దకు తరలించారు. బ్యాలెట్‌ బాక్సుల్లో జిల్లాలోని 65 వార్డుల్లో బరిలో ఉన్న 243 మంది అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూముల్లో బ్యాలెట్‌ బాక్సులను భద్రపర్చారు. శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి.

దొంగ ఓటర్ల హల్‌చల్‌..

నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలోని 15వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య కొద్దిసేపు వివాదం చోటుచేసుకుంది. మైనర్లతో ఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలింగ్‌ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కా ర్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సైతం పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement