మహదేవప్ప కుటుంబానికి పరామర్శ
మక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్‌కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పా ర్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్‌డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.
రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేసిన కేంద్ర మంత్రి


