అధునాతన హంగులు.. అంతర్జాతీయ ప్రమాణాలు
● సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
● జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటుకు శంకుస్థాపన
● రూ.200 కోట్లతో భవనాల నిర్మాణాలు, ఇతర వసతుల కల్పన
● జటప్రోల్‌లో 20 ఎకరాల విస్తీర్ణంలో చకచకా పనులు
● పేద విద్యార్థులకు వరంగా మారనున్న పాఠశాలలు
కందనూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమా ణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలలు నిర్మిస్తోంది. అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, డిజిటల్ క్లాసులు, స్మార్ట్ బోర్డులు, విశాలమైన మైదానాలు, విభిన్న రకాల ప్లే గ్రౌండ్స్‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు. జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంతో పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్య అందనుంది.
అన్నిరకాల వసతులు..
యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు అధునాతన, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంపస్‌లో అధునాతన తరగతి గదులు, డార్మెంటరీలు, ల్యాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్, సుమారు 5 వేల పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేస్తారు. ఒకేసారి 900 మంది కూర్చొని భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ నిర్మాణం, ప్రతి డార్మెంటరీలో పది బెడ్లు, రెండు బాత్‌రూంలు ఉంటాయి. హాస్పిటల్, ఆడిటోరియం, గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ సౌకర్యాలు కల్పిస్తారు. కేవలం విద్యాబోధనే కాకుండా ఒత్తిడి నియంత్రణ కోసం స్పోర్ట్స్, కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం విశాలమైన క్రికెట్ మైదానం, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, ఇండోర్, అవుట్ డోర్ గ్రౌండ్స్, జిమ్, మినీ యాంపీ థియేటర్ తదితర సౌకర్యాలు ఉండనున్నాయి.
ఐదో తరగతి నుంచి..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే గొడుగు కింద నాణ్యమైన విద్య పొందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ఉంటుంది. ఈ పాఠశాలలో సుమారు 2,500 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంది. పాఠశాలలో కనీసం 120 మంది టీచర్లు పనిచేస్తారు. డిజిటల్ క్లాస్‌లతోపాటు స్మార్ట్ బోర్డుల ద్వారా విద్యాబోధన ఉంటుంది. అధునాతన పాఠశాల భవనాలు, హాస్టళ్లు, క్వార్టర్స్ సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. స్థానిక పరిస్థితులు, వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా భవనాల డిజైనింగ్, నిర్మాణం చేపట్టనున్నారు.
మొట్టమొదట జటప్రోల్‌లో..
పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెబుతోంది. విడతల వారీగా నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తుండగా.. జిల్లాలో తొలిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్‌లో స్కూల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం గ్రామంలో 20 ఎకరాల భూమి కేటాయించగా.. రూ.200 కోట్ల వ్యయంతో సువిశాల భవనాలు, హాస్టళ్లు, మైదానాలు తదితర వసతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో స్థల సేకరణ జరగగా.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం తూడుకుర్తి, అచ్చంపేట నియోజకవర్గం రాయిచేడు, కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోల్ ఉన్నాయి. ఇందులో ఒక జటప్రోల్‌లో మాత్రమే ప్రస్తుతం పాఠశాల నిర్మాణానికి పనులు చకచకా జరుగుతున్నాయి.
అధునాతన హంగులు.. అంతర్జాతీయ ప్రమాణాలు


